ఏపీ రాజకీయాల్లో లెక్కలు మారుతున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. విశాఖ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2024 ఎన్నికల్లో కూటమి భారీ మెజార్టీ తో విశాఖ పరిధిలో సీట్లు గెలుచుకుంది. విశాఖ రాజధానిగా ప్రతిపాదించిన వైసీపీకి ఎన్నికల్లో మద్దతు దక్కలేదు. ఇక.. కూటమి అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలోను పార్టీల బలా బలాలు మారిపోతున్నాయి. తాజాగా విశాఖ కేంద్రంగా కూటమి తీసుకున్న నిర్ణయంతో వైసీపీ ఆత్మ రక్షణలో పడింది. ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారుతోంది.
మారుతున్న లెక్కలు కూటమి పార్టీలు కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల కైవసం కోసం ఆపరేషన్ మొదలు పెట్టాయి. ఇప్పటి వరకు డిప్యూటీ ఛైర్మన్ పదవులు దక్కించుకుంటున్న కూటమి.. ఇప్పుడు గుంటూరు, విశాఖ నగర పాలక సంస్థలను దక్కించుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి మినహా అన్ని కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల ను అధికార పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు కూటమి వరుసగా కార్పోరేషన్ల పైన ఫోకస్ చేసింది. అందులో భాగంగా తాజాగా గుంటూరు వైసీపీ మేయర్ రాజీనామా చేసారు. త్వరలోనే గుంటూరు మేయర్ గా టీడీపీ నేత పగ్గాలు చేపట్టటం లాంఛనంగా కనిపిస్తోంది.
కూటమి నేతల నిర్ణయం ఇక, విశాఖ మేయర్ పీఠం దక్కించుకునేందుకు కూటమి పావులు కదుపుతోంది. మార్చి 18 తో జీవీఎంసీ పాలకవర్గ పదవీకాలం నాలుగేళ్లు ముగిసిన సందర్భంగా అవిశ్వాస తీర్మానానికి అవకాశం దక్కింది. దీంతో, విశాఖకు చెందిన కూటమి నేతలు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. దీంతో రాష్ట్రంలో అతిపెద్ద నగరపాలక సంస్థ అయిన జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానం ఎదు ర్కొంటారా.. మారుతున్న లెక్కలతో ముందుగానే రాజీనామా చేస్తారా అనేది కీలకంగా మారుతోంది. 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జీవీఎంసీ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. స్టాండిం గ్ కమిటీ ఎన్నికల్లో కూటమి మెజార్టీ సాధించింది. జీవీఎంసీ కి చెందిన మెజారిటీ కార్పొరేటర్లు సైతం కూటమి పార్టీలోకి వచ్చేశారు. పలువురు వైసీపీ కార్పోరేటర్లు టీడీపీ.. జనసేనలో చేరారు. దీంతో, జీవీఎంసీలో కూటమి బలం పెరిగింది.
కూటమికే పీఠం జీవీఎంసీలో98 డివిజన్లు ఉన్నాయి. 2021 లో జరిగిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 58 డివిజన్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ 29 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. జనసేనకు మూడు సీట్లు వచ్చాయి. బిజెపి ఒక స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుత మేయర్ గొలగాని హరి వెంక ట కుమారిపై అవిశ్వాస తీర్మానానికి కూటమి నేతలు సిద్దమయ్యారు. తక్షణం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ 70 మంది కార్పొరేటర్ల సంతకాలతో కలెక్టర్ కు నోటీస్ ఇచ్చారు. కాగా, ప్రస్తుతం కూటమికి 70 మంది కార్పొరేటర్లు, 11 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల బలం ఉంది. దీంతో.. త్వరలోనే విశాఖ మేయర్ పీఠం కూటమి దక్కించుకోవటం లాంఛనంగా కనిపిస్తోంది.