నీట్ యూజీ 2024 పేపర్ లీక్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపింది. ఇలాంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ తీవ్ర దుమారం లేపింది.
ఈనేపథ్యంలో ప్రశ్నపత్రం లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా బిహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లు-2024ను ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. బుధవారం ఆమోదం లభించింది. మంత్రి విజయ్ కుమార్ చౌదరి సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల వాకౌట్ మధ్య వాయిస్ ఓటుతో బిల్లును ఆమోదించారు.
నీట్-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్, అక్రమాల వ్యవహారంలో బిహార్ కేంద్ర బిందువుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో పోటీ పరీక్షల్లో అక్రమాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు ప్రకారం.. పోటీ పరీక్షల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. దోషులుగా తేలిన వారి ఆస్తులను అటాచ్ చేయడంతోపాటు, పరీక్షల అక్రమాల్లో అరెస్టయిన దోషులకు కనీసం బెయిల్ పొందడం కూడా కష్టతరం చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
కాగా నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించేది లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు గత మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీహార్‌లోని రెండు పరీక్ష కేంద్రాల్లో పేపర్ లీక్ అయినట్లు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. జార్ఖండ్‌లోని పాట్నా, హజారీబాగ్‌లలో పేపర్ లీకులు జరిగినట్లు పేర్కొంది. అలాగే బిహార్‌లోని పలు రాష్ట్ర స్థాయి పరీక్షల్లోనూ ఇప్పటి వరకు అనేక పేపర్ లీక్ కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రానికి చెందిన ముఠాలు పేపర్ లీకులు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. బీహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నిరోధక) చట్టం, 2024 ప్రకారం.. పేపర్‌ను లీక్ చేయడం లేదా జవాబు పత్రాలను ట్యాంపరింగ్ చేయడం వంటి నేరాలకు పాల్పడిన వారికి కనీసం మూడేళ్ల నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఈ చట్టం ప్రకారం ఇలాంటి నేరాలన్నీ నాన్-బెయిలబుల్ కిందకి తీసుకుంటారు. విచారణలో నేరం రుజువైతే అటువంటి వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. కోటి జరిమానా విధిస్తారు.