క్రెడిట్‌ కార్డు బిల్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. ఈ పరిమితి దాటితే IT నజర్‌!

ఆదాయపు పన్ను పరిమితికి మించి సంపాదన ఉన్నవారు ఐటీఆర్‌ (Income Tax Returns) దాఖలు చేయడం తప్పనిసరి. కానీ, మీ ఆదాయం..


పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పటికీ మీరు చేసే కొన్ని ఆర్థిక లావాదేవీలు.. మిమ్మల్ని ఆదాయ పన్నుశాఖ దృష్టికి తీసుకెళ్లొచ్చు. కొన్ని సందర్భాల్లో నోటీసులు అందుకోవాల్సి రావొచ్చు. ఇటువంటి సమస్య ఎదురవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చార్టర్డ్‌ అకౌంటెంట్‌, ట్యాక్స్‌ నిపుణుడు నితిన్‌ కౌశిక్‌ తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్‌ చేశారు.

ఏడాదిలో రూ.10 లక్షలకు పైగా నగదు డిపాజిట్లు

ఒక ఆర్థిక సంవత్సరంలో మీ అన్ని సేవింగ్స్‌ అకౌంట్లలో కలిపి రూ.10 లక్షలకు పైగా నగదు డిపాజిట్‌ చేస్తే ఆ విషయం ఆదాయపు పన్ను విభాగం దృష్టికి వెళ్లే అవకాశముంది. ఆ మొత్తాన్ని ఒక్క అకౌంట్‌లో కాకుండా బహుళ ఖాతాలకు విభజించినప్పటికీ బ్యాంకులు వాటిని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ)కు రిపోర్ట్‌ చేస్తాయి.

ఎఫ్‌డీల్లో రూ.10 లక్షలకు మించి పెట్టుబడులు

వేర్వేరు బ్యాంకుల్లో కలిపి రూ.10 లక్షలకు పైగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినా కూడా ఆ వివరాలు ఐటీ విభాగానికి రిపోర్ట్‌ అవుతాయి. డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను లోబడి ఉంటుంది. మీ ఆదాయం, డిక్లేర్‌ చేసిన ఆదాయ వివరాలకు మధ్య పొంతన లేకపోతే ఐటీ విభాగం ఆరా తీయొచ్చు.

క్రెడిట్‌ కార్డు బిల్లు..

ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు రూ.లక్షకు పైగా నగదు లేదా రూ.10 లక్షలకు పైగా చెక్‌/డిజిటల్‌ మార్గంలో క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపులు చేస్తే ఆ లావాదేవీ ఐటీ విభాగానికి రిపోర్ట్‌ అవుతాయి. మీరు కష్టపడి సంపాదించిన సొమ్మే అయినా అధికంగా ఖర్చు చేస్తే ఆ వివరాలు ఆదాయపు పన్ను విభాగానికి చేరుతాయి.

ఆస్తుల కొనుగోలు లేదా విక్రయం

రూ.30 లక్షలకు పైగా ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం జరిగితే అది ఐటీ డిపార్ట్‌మెంట్‌ దృష్టిలోకి వస్తుంది. ఆ లావాదేవీకి సంబంధించిన డాక్యుమెంటేషన్‌, నిధుల మూలాన్ని సరైన రీతిలో ఐటీఆర్‌లో చూపించడం చాలా ముఖ్యం.

మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లు, బాండ్లు

ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు మ్యూచువల్‌ ఫండ్స్‌, స్టాక్స్‌, బాండ్లలో రూ.10 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టినట్లయితే ఐటీ విభాగం వాటిని గమనిస్తుంది. క్యాపిటల్‌ గెయిన్స్‌, డివిడెండ్‌ ఆదాయాన్ని రిటర్నుల్లో క్లియర్‌గా డిక్లేర్‌ చేయాలి. ఒక స్కీమ్‌ నుంచి మరో స్కీమ్‌కు బదిలీ అయినపుడు రిపోర్ట్‌ చేయాల్సిన అవసరం లేదు.

రూ.2 లక్షలకు పైగా విదేశీ ప్రయాణ ఖర్చులు

విదేశీ ప్రయాణానికి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేస్తే అది కూడా ఐటీ పరిధిలోకి వెళుతుంది. ఇందుకు సరిపోయే ఆదాయం మీ ఐటీఆర్‌లో చూపకపోతే నోటీసు వచ్చే అవకాశం ఉంటుంది.

చివరిగా: ఒక ఏడాదిలో ఇవన్నీ చేసినంత మాత్రాన ఐటీ విభాగం నుంచి నోటీసు వస్తుందని కాదు. వాటిని ఐటీఆర్‌లో రిపోర్ట్‌ చేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తొచ్చు. మీరు చూపించే ఆదాయానికి, మీరు చేసే జీవన వ్యయాలకు ఎక్కడా పొంతన కుదరకపోతే ఐటీ నోటీసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సరైన సమయానికి ఐటీఆర్‌ దాఖలు చేయడంతో పాటు పూర్తి పారదర్శకతతో ఆదాయాన్ని చూపించాలి. అలాగే, రిటర్నులు సబ్మిట్‌ చేసే ముందు 26ఏఎస్‌, AISలోని వివరాలను సరిపోల్చుకోండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.