ఏపీ మంత్రి ఇంట తీవ్ర విషాదం.. సతీమణి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఇంట విషాదం.. ఆయన సతీమణి షెహనాజ్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సతీమణి మరణవార్త తెలియడంతో మంత్రి ఫరూక్ హుటాహుటిన నంద్యాల నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. షెహనాజ్‌ పార్థీవ దేహాన్ని హైదరాబాద్ నుంచి నంద్యాలకు తరలించనున్నారు.. అంత్యక్రియల్ని శనివారం నిర్వహించే అవకాశం ఉంది. షెహనాజ్ ఐదారు నెలలుగా తీవ్ర అనారోగ్యతో బాధపడుతున్నారు.


మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సతీమణి షెహనాజ్ మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపాన్ని తెలియజేశారు. ఎన్ఎండీ ఫరూక్ సతీమణి షెహనాజ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. . సతీమణి మరణంతో విషాదంలో ఉన్న ఫరూక్ కుటుంబానికి ముఖ్యమంత్రి సానుభూతిని తెలిపారు. ఫరూక్‌ కుటుంబానికి అల్లా మనోధైర్యాన్ని అందించాలని ప్రార్థించారు.

అలాగే ఎన్‌ఎండీ ఫరూక్‌ సతీమణి మృతి పట్ల మంత్రి లోకేష్ సంతాపాన్ని తెలియజేశారు. షెహనాజ్‌ ఆత్మకు శాంతి కలగాలని అల్లాను ప్రార్థిస్తున్నాను అన్నారు. అలాగే మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంత్రి ఫరూక్ అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో హాజరవుతున్నారు.. గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో ఆయన నంద్యాల వెళ్లారు. అయితే సతీమణి మరణవార్తతో ఆయన హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు.