విజృంభిస్తోన్న డెంగీ జ్వరాలు.. అప్రమత్తంగా ఉండాలంటోన్న వైద్యులు! లక్షణాలు ఇవే

www.mannamweb.com


వర్షాకాలంలో చుట్టూ నీరు నిలిచి దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు డెంగ్యూ వ్యాప్తి కూడా పెరుగుతోంది. ఈ కాలంలో జ్వరంతోపాటు శరీర నొప్పులు ఉంటే, ముందుగానే జాగ్రత్తగా ఉండాలి.

అందుకే జ్వరం రాగానే ముందుగా డెంగ్యూ సోకిందో లేదో నిర్ధారించుకోవాలి. డెంగ్యూ జ్వరం వస్తే 101 నుండి 102 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. నిరంతరం జ్వరంగా ఉంటుంది.

అలాగే తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, చర్మంపై ఎర్రటి దద్దుర్లు డెంగ్యూ లక్షణాలు కావచ్చు. వికారం, తీవ్రమైన ఎముకలు, కండరాల నొప్పి కూడా సంభవించవచ్చు. రెండు రోజులైనా జ్వరం తగ్గకపోతే ముందుగా వైద్యులను సంప్రదించాలి. ఈ సమయంలో వీలైనంత ఎక్కువగా నీర త్రాగాలి. అలాగే అధికంగా ద్రవం శరీరానికి అందించాలి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం తాగడం ఇష్టం లేకుంటే కనీసం పండ్ల రసం అయినా తాగవచ్చు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం పారాసెటమాల్ గరిష్ట మోతాదు రోజుకు నాలుగు గ్రాముల వరకు తేసుకోవచ్చు. కానీ కాలేయం, గుండె, మూత్రపిండాలకు సంబంధించిన ఏవైనా వ్యాధులు ఉంటే పారాసెటమాల్ తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు. అయితే తలనొప్పికి ఆస్పిరిన్ తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది రక్తస్రావం సమస్యలను కలిగిస్తుంది.

డెంగ్యూలో ‘ఎ’, ‘బి’, ‘సి’ అనే మూడు రకాలు ఉంటాయి. సాధారణంగా డెంగ్యూ ‘ఎ’ సోకితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే డెంగ్యూ ‘బి’ సోకితే కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలు కనిపిస్తాయి. డెంగ్యూ ‘సి’ వ్యాధి సోకితే అధ్వాన్నమైన పరిస్థితికి చేరుకుంటారు. డెంగ్యూ జ్వరం ఏడిస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ దోమలు రాత్రిళ్లు కుట్టవు. ఏడిస్ దోమలు ఉదయం, సాయంత్రం వేళల్లో చురుగ్గా ఉంటాయి.

అలాగే ఇంటి చుట్టూ ఎక్కడా నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఏడిస్ దోమ పరిశుభ్రమైన నీటిలో గుడ్లు పెడుతుంది. ఏడిస్ దోమలు ఇంటి పైకప్పు మీద, బాల్కనీలోని పూల టబ్‌లో, నిర్మాణంలో ఉన్న భవనంలోని వివిధ ప్రదేశాలలో, రహదారి పక్కన పడి ఉన్న టైర్లు వంటి ఇతర కంటైనర్లలో వర్షం వల్ల చేరిన నీటిలో వృద్ధి చెందుతాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.