చరిత్ర సృష్టించిన ధోని.. ప్రాణ మిత్రుడి రికార్డు బద్దలు

ఐపీఎల్‌-2025లో చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది.


197 పరుగుల భారీ లక్ష్యాన్ని సీఎస్‌కే చేధించలేక చతికలపడింది. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 146 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమి పాలైనప్పటికి .. ఆ జట్టు లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎం​ఎస్ ధోని మాత్రం తన మెరుపు ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు.

తొమ్మిదో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని తనదైన స్టైల్లో షాట్లూ ఆడుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖరి ఓవర్ వేసిన కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో మిస్టర్ కూల్‌.. రెండు సిక్స్‌లు, 1 ఫోర్‌తో 16 పరుగులు రాబాట్టాడు. ఓవరాల్‌గా కేవలం 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోని.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ధోని ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధోరి రికార్డులకెక్కాడు. ధోని ఇప్పటివరకు సీఎస్‌కే తరపున 236 మ్యాచ్‌లు ఆడి 4693 పరుగులు చేశాడు. ఇంతకుముందు వరకు రికార్డు మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా పేరిట ఉండేది. రైనా సీఎస్‌కే తరపున 4,687 పరుగులు చేశాడు.

తాజా మ్యాచ్‌లో 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద తన మిత్రుడి రికార్డును తలైవా బ్రేక్ చేశాడు. కాగా రైనా చాలా సీజన్ల పాటు సీఎస్‌కేకే ప్రాతినిథ్యం వహించాడు. ధోనికి రైనాకు మంచి అనుబంధం ఉంది. అప్పటిలో అతడిని చిన్న తలా అని అభిమానులు పిలుచుకునే వారు.

చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సీఎస్‌కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్‌, లివింగ్‌స్టోన్ తలా రెండు వికెట్లు సాధించారు.

చెపాక్‌లో సీఎస్‌కేపై ఆర్సీబీ విజయం సాధించడం 2008 సీజన్ తర్వాత ఇదే తొలిసారి. దీంతో సీఎస్‌కే కంచుకోటను పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ బద్దలు కొట్టింది. 2008 సీజన్ తర్వాత ఏ ఆర్సీబీ కెప్టెన్ కూడా చెపాక్‌లో సీఎస్‌కేపై తన జట్టును గెలిపించకలేకపోయాడు. ఇప్పుడు అది పాటిదార్‌కు సాధ్యమైంది.