విద్యార్థులూ మధుమేహం బారిన పడుతుండటంపై సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై వారిలో చైతన్యం తెచ్చేందుకు పాఠశాలల్లో మధుమేహ అవగాహన బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తన పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఈ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ తాజాగా ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులకు మధుమేహం గురించి పూర్తి సమాచారం అందించాలని అందులో పేర్కొంది. ‘మధుమేహంవల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ప్రతి రోజూ ఎంత మోతాదులో చక్కెర తీసుకోవాలి.. సాధారణంగా తీసుకునే ఆహార పదార్థాల్లో ఎంత చక్కెర ఉంటుంది.. అనే విషయాలను విద్యార్థులకు తెలియజేయాలి. అధిక చక్కెర వినియోగంవల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. అందుకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయాల గురించి వారికి వివరించాలి’ అని సీబీఎస్‌ఈ పేర్కొంది. ‘గడిచిన పదేళ్లుగా చిన్నారులూ టైప్-2 మధుమేహం బారిన పడుతున్నారు. గతంలో ఇది పెద్దల్లోనే కనిపించేది. దీనికి కారణం అధిక చక్కెర వినియోగం. పాఠశాల పరిసరాల్లో విక్రయించే చిరుతిళ్లు, శీతల పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల విద్యార్థుల్లో చక్కెర వినియోగం పెరిగిపోతోంది. దీంతో వారిలో మధుమేహంతో పాటు ఊబకాయం, దంత సమస్యలవంటి రుగ్మతలు పెరిగిపోతున్నాయి. పిల్లల దీర్ఘకాలిక ఆరోగ్యంపైనే కాకుండా వాళ్ల ప్రతిభనూ ఇది ప్రభావితం చేస్తోంది. 4-10 సంవత్సరాల వయసు గల పిల్లలకు రోజువారీ ఆహారంలో 13శాతం చక్కెర ఉండాలి. అదే 11-18 సంవత్సరాల వయసున్న వారికి 15శాతం ఉండాలని అధ్యయనాలు చెబుతున్నాయి’ అని సీబీఎస్‌ఈ వెల్లడించింది.
































