మన చేతిలోనే డయాబె’ట్రిక్‌’

మధుమేహం(డయాబెటీస్‌) మెల్లగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇటు ప్రభుత్వ సర్వజన ఆసుత్రులోనూ అటు ప్రయివేటు ఆసుపత్రుల్లో రోజూ వస్తున్న రోగుల్లో 10నుండి 15శాతం మంది డయాబెటీస్‌ బాధితులేనని వైద్యులు చెబుతున్నారు. జీవన విధానంలో మార్పులు, అధిక పని ఒత్తిడి, ఆందోళన వల్ల డయాబెటిక్‌ రోగులు పెరుగుతున్నారనేది వైద్యుల మాట. యువతలో కూడా డయాబెటిక్‌ కనిపించడం మరింత ఆందోళనకరం. ఇంత కీలకమైన మధుమేహాన్ని నియంత్రించేందుకు కృత్రిమ ఇన్సులెన్‌ను శాస్త్రవేత్త సర్‌ఫ్రెడరిక్‌ జి.బాంటింక్‌ కనుగొన్నారు. ఆయన జన్మదినాన్ని ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.


డయాబెటీస్‌ అంటే..

డయాబెటీస్‌ అనేది రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి అసాధారణంగా పెరిగే దీర్ఘకాలిక సమస్య. క్లోమం ఇన్సూలిన్‌ తగినంతగా ఉత్పత్తి చేయకపోవడం లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ శరీరం సమర్థంగా ఉపయోగించుకోకపోవడం దీనికి ప్రధాన కారణం.

– టైప్‌1 డయాబెటిస్‌: ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ సమస్య. ఇందులో క్లోమం ఇన్సులిన్‌ ఉత్పత్తిని పూర్తిగా ఆపేస్తుంది. ఇది సాధారణంగా చిన్నపిల్లలు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది.

– టైప్‌2 డయాబెటిస్‌: అత్యంత సాధారణ రకం. ఇక్కడ ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఏర్పడుతుంది. అధిక బరువు శారీరక శ్రమ లేకపోవడం వంటి జీవన శైలి కారకాలు దీనికి ప్రధాన కారణం.

– గర్భదారణ డయాబెటీస్‌: గర్భవతిగా ఉన్న మహిళల్లో హార్మోన్లు మార్పు కారణంగా తాత్కాలికంగా డయాబెటిస్‌ రావొచ్చు.

జిల్లాలో కేసులిలా

సంవత్సరం నమోదైన కేసులు

2024 1,44, 952

2025 (అక్టోబరు వరకూ) 1, 81, 270

కారణాలు ఇవే..

నడక,శారీరకశ్రమ తగ్గిపోవడం, అధిక బరువు(ఊబకాయం), అధికంగా బియ్యం వాడకం, అధికంగా చక్కెర కలిగిన స్వీట్స్‌, టీకాఫీలు, కూల్‌డ్రింక్స్‌, జంక్‌ఫుడ్స్‌, ఫ్రైడ్‌ ఐటమ్స్‌, అధిక ఒత్తిడి నిద్రలేమి, వంశపారంపర్యం, స్టిరాయిడ్స్‌ వంటి ఔషధాల వినియోగం వల్ల, ధూమపానం మద్యపానం అలవాట్లు ఇన్సులిన్‌ ప్రభావాన్ని దెబ్బతీస్తాయి. దీనివల్ల కొందరిలో చిన్నవయసులోనే డయాబెటీస్‌ బారిన పడుతున్నారు.

రక్తంలో గ్లూకోజ్‌ స్ధాయి ఎంతుండాలంటే..?

రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని బట్టి డయాబెటీస్‌ను నిర్థారించవచ్చు. ఖాళీ కడుపుతో గ్లూకోజ్‌(ఎఫ్‌బిఎస్‌) పరీక్ష చేసినప్పుడు 70-100ఎంజీ/డీఎల్‌ ఉండాలి. 126 ఎంజీ/ డీఎల్‌ ఉంటే మధుమేహం ఉందని అర్థం. అలాగే భోజనం తరువాత (పిపిబిఎస్‌) 140 ఎంజీ/ డీఎల్‌ ఉండాలి. అదే 200 ఉంటే డయాబెటిస్‌ ఉందని అర్థం.

తినాల్సిన ఆహారాలు

బ్రౌన్‌రైస్‌, ఓట్స్‌, చిరుధాన్యాలైన రాగులు, జొన్నలు, సజ్జలు, అరికెలు, పాలకూర, తోటకూర, మెంతికూర, కాకరగాయ, దొండకాయ, ఉల్లి, వెల్లుల్లి, అన్నిరకాల పప్పులు, చిక్కుళ్లు, శెనగలు, రాజ్మా, సోయాబీన్స్‌, సిట్రస్‌ ఫలాలైన నారింజ, నిమ్మ, బత్తాయి, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, ఆపిల్‌, పియర్స్‌, జామకాయను ఆహారంగా తీసుకోవాలి. అలాగే ఒమేగా 3 కలిగిన చేపలు, గుడ్లు, పెరుగు, మజ్జిగ వంటి ఆహారం తీసుకోవడం ద్వారా డయాబెటీస్‌ రాకుండా చూసుకోవచ్చు. అలాగే నియంత్రించవచ్చు.

తినకూడని ఆహారాలు

సోడాలు, కూల్‌డ్రింక్స్‌, కేకులు, మిఠాయిలు, ఐస్‌క్రీంలు, చాక్లెట్లు, టీ, కాఫీలు, తెల్ల అన్నం, మైదాతో చేసిన బ్రెడ్‌లు, బిస్కెట్లు, పూరీలు, ప్రాసెస్‌ చేసిన అల్పాహారాలు, ఫైడ్‌ ఫుడ్స్‌ అయిన పిజ్జా బర్గర్‌లు, గొర్రె, మేక మాంసం తదితరాలను మానివేయాలి. ఎక్కువగా పండిన అరటిపండ్లు, ద్రాక్ష, సీతాఫలం, బంగాళదుంపలు, చిలగడ దుంపలు, మత్తు పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. వీటిని ఆపేయాలి. సరైన నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా మధుమేహ నివారణకు కీలకం.

జీవనశైలిలో మార్పు చేసుకోవాలి

డాక్టర్‌ బి.రాజేష్‌ పల్లంరాజు, డయాబెటాలజిస్ట్‌, విజయనగరం

డయాబెటీస్‌ అనేది నివారించదగిన, నియంత్రించదగిన వ్యాధి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా నియంత్రివచ్చు. కేవలం మందులపై ఆధారపడకుండా ప్రతీ ఒక్కరు తమ జీవనశైలిపై దృష్టి పెట్టాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగి, ఎక్కువ పైబర్‌ కలిగిన సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం, బరువు నియంత్రించడం ద్వారా 90శాతం మధుమేహాన్ని అడ్డుకోవచ్చు. ఫైబర్‌ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటూ ప్రాసిస్‌ చేసిన ఆహారాలు, అధిక చక్కెర ఉన్న పానీయాలు, జంక్‌ఫుడ్స్‌, పూర్తిగా మానివేయాలి. ఒత్తిడి తగ్గించుకోవడం, సరైన నిద్రవల్ల ఇన్సులిన్‌ మెరుగుపడుతుంది. అలాగే 30ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరు క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.