టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. ఎందుకంటే టెక్నాలజీతో ప్రయోజనాలే కాదు కొన్నిసార్లు దుష్ప్రరిణామాలు కూడా ఉంటాయి.
ప్రస్తుతం చాలావరకు చాట్జీపీటీ (ChatGPT) వంటి కృత్రిమ మేధస్సు (Artificial intelligence) చాట్బాట్లు మనుషులతో సంభాషించి సమాధానాలు చెబుతున్నాయి. అయితే సాధారణ విషయాలకు సమాధానాలు చెప్పడం, మీకు కావాల్సిన చిన్న పనుల్లో మద్దతు తీసుకోవడం వరకు ఓకే. కానీ అన్ని వేళలా, అన్ని విషయాలలో ఏఐ చాట్బాట్లతో విషయాలు షేర్ చేసుకోవద్దు. ఏఐతో వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవడం ప్రైవసీ ఉల్లంఘనకు, డేటా చోరీ, ఐడెంటిటీ చోరీ లాంటి వాటికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక కింద పేర్కొన్న పది విషయాలను మీరు చాట్ జీపీటీతో పాటు ఇతర ఏఐ టెక్నాలజీ టూల్స్తో షేర్ చేసుకోవద్దు అని తెలుసుకోండి.
ఏఐ చాట్బాట్లతో అస్సలు షేర్ చేసుకోకూడదని 10 విషయాలివే..
ఆర్థిక అంశాలు: మీ బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్ కార్డ్ వివరాలు లేదా సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ లాంటి వాటిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసే అవకాశముంది. కనుక బీరు ఏఐ చాట్బాట్లో నమోదు చేస్తే, ఈ డేటా సైబర్ నేరాళ్లచేతికి వెళ్లి ఇబ్బంది పడతారు. మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావొచ్చు. మీ క్రెడిట్, డెబిట్ కార్డులతో ఇతరులు షాపింగ్ చేసే మోసాలు జరుగుతాయి. కనుక మీ బ్యాంకు ఖాతాలు, కార్డుల వివరాలను అధికారిక సంస్థలు, అధికారులతో మాత్రమే షేర్ చేసుకోవాలి, కానీ చాట్ జీపీటీ లాంటి వాటితో కాదని గ్రహించండి.
వ్యక్తిగత సమాచారం: మీ పూర్తి పేరు, ఇంటి అడ్రస్, మీ ఫోన్ నంబర్ ఈమెయిల్ వంటి వివరాలు, పనిచేసే ఆఫీసు వివరాలు లాంటివి మీ ఆన్లైన్ గుర్తింపును ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తారు. కనుక ఈ విషయాలు అపరిచితులతో పాటు ఏఐ టూల్స్ తో సైతం షేర్ చేసుకోవడం సరికాదు. సైబర్ నేరాల బారిన పడే అవకాశం ఉంది. మీ లొకేషన్ ట్రాక్ చేసి ఇబ్బందులకు గురిచేయవచ్చు. ప్రైవసీ మెయింటైన్ చేయాలి.
చట్టపరమైన అంశాలు: కాంట్రాక్టులు, కోర్టు కేసులు, లేదా వ్యక్తిగత వివాదాల విషయంలో ఏఐ చాట్బాట్ను సహాయం అడగకూదు. వాటికి వివరాలు అందిస్తే మీ డేటా లీక్ అయ్యి, మీకే హాని జరగవచ్చు. ఏఐ ఎప్పటికీ లాయర్లకు ప్రత్యామ్నాయం కాదు. మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశాలున్నాయి. విషయం ముందే లీక్ అయితే కేసులు ఓడిపోయే అవకాశం ఉంది.
ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు: మీ ప్రైవేట్ ఫోటోలను, ఐడీలు, పాస్పోర్ట్లు, డ్రైవింగ్ లైసెన్స్లను చాట్బాట్లో ఎప్పుడూ అప్లోడ్ చేయవద్దు. వాటిని రిమూవ్ చేసినా డిజిటల్ గా ఎక్కడైనా సేవ్ అవుతాయి. మీ వ్యక్తిగత ఫైల్స్ హ్యాక్ చేసి, దుర్వినియోగం చేయవచ్చు. వ్యక్తిగత డాక్యుమెంటేషన్ను ఎల్లప్పుడూ ఆఫ్లైన్లో, ఎన్క్రిప్టెడ్ స్టోరేజ్లో ఉంచాలి. లేకపోతే భవిష్యత్తులో చిక్కులు తప్పవు.
పాస్వర్డ్లు: ఏ ఏఐ చాట్బాట్కు మీ లాగిన్ వివరాలు చెప్పకూడదు. సాధారణ చాటింగ్ లో కూడా పాస్వర్డ్లను షేర్ చేసుకున్నా మీ ఈమెయిల్, బ్యాంకింగ్, సోషల్ మీడియా ఖాతాలు, ఆఫీసు అకౌంట్లు హ్యాకింగ్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఏఐ చాట్లలో పాస్వర్డ్స్, ఫైల్స్ ఎప్పుడూ ఉంచకూడదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం, మెడికల్ సమాచారం: మీ అనారోగ్య లక్షణాలు లేదా చికిత్సల గురించి ఏఐ చాట్బాట్లను అడగటం సరికాదు. దానిద్వారా మీకు తప్పుడు రోగ నిర్ధారణ జరగవచ్చు. కనుక డాక్టర్ రికార్డులు, మెడికల్ ప్రిస్కిప్షన్ వంటివి, ఇన్సూరెన్స్ పాలసీ నెంబర్ వివరాలు లీక్ అయితే ప్రమాదకరం. డాక్టర్లను మాత్రమే సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
సీక్రెట్ రివీల్ చేయవద్దు: కొంతమంది తమ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఏఐ చాట్బాట్కు తమ బాధను లేదా రహస్యాలను చెబుతుంటారు. కానీ థెరపిస్ట్తో, మీ సన్నిహితులతో చెప్పినంత సురక్షితం కాదని గుర్తుంచుకోండి. మీ సిక్రెట్స్ ను చాట్ బాట్ రివీల్ చేస్తే వాటిని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి మీకు మరింత నష్టాన్ని కలిగించే అవకాశాలున్నాయి.
వర్క్ సంబంధిత సమాచారం: ఉద్యోగులు సీక్రెట్ పేపర్లు, డాక్యుమెంట్స్, లేదా కంపెనీ ప్లాన్ వివరాలను ఏఐ టూల్స్, చాట్ జీపీటీ లాంటి చాట్బాట్ లలో కాపీ చేసి పేస్ట్ చేయవద్దని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. కంపెనీ వ్యూహాలు, అంతర్గత నివేదికలు వేరే ఆఫీసులకు లీక్ కావచ్చు. ఆఫీస్ డేటా, ఆఫీస్ ప్లాన్స్, బిజినెస్ టార్గెట్స్ షేర్ చేసుకోవడం కార్పొరేట్ భద్రతకు ప్రమాదకరం.
ప్రైవసీ కోరుకునే విషయాలు: మీరు చేస్తున్న పని, మీ అలవాట్లు గానీ ఇతరులకు తెలియకూడదంటే వాటిని ఎప్పుడూ ఏఐ టూల్స్, చాట్బాట్లతో అసలు షేర్ చేసుకోవద్దు. ఒకసారి మీరు ఏఐ చాట్బాట్లకు చెప్పారంటే ఏదో ఒకరోజు ఆ విషయం బహిర్గతం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక ఒకసారి రెండుసార్లు ఆలోచించి విషయాలను ఏఐ టూల్స్ తో షేర్ చేసుకోవాలి. మీ డేటా స్టోర్ అవుతుంది. మీరు డిలీట్ చేసినా ఏదో ఓ రోజు మరో కొత్త టూల్, కిట్ ద్వారా విషయం లీకయి మీరు ఆందోళన చెందవచ్చు. డిప్రెషన్ బారిన పడే అవకాశాలు సైతం లేకపోలేదు.
అనుచిత వీడియో, అస్పష్టమైన కంటెంట్: సాధారణంగా అశ్లీల లేదా చట్టవిరుద్ధమైన విషయాలను బ్లాక్ చేసినప్పటికీ ఏఐ ప్లాట్ఫారమ్లు మీరు షేర్ చేసిన వివరాలు రికార్డు చేసే ప్రమాదం ఉంది. ఇందులో ముఖ్యంగా లైంగిక వీడియోలు, సమాచారం, అభ్యంతరకర వ్యాఖ్యలు లేదా చట్టవిరుద్ధమైన విషయాలు ఉంటే మరిన్ని చిక్కులు తప్పవు. కనుక అలాంటి పనులు మీరు రికార్డ్ చేయకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
































