ఒక్కొక్కరికి రెండు సచివాలయాలు కేటాయింపు
జాబితాలో వ్యవసాయ, ఉద్యానవన, సెరికల్చర్, ఫిషరీస్, పశు సంవర్ధక శాఖ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్, ఏఎన్‌ఎం, ఇంజనీరింగ్, ప్లానింగ్, ఎమినిటీస్ సెక్రటరీలు
మిగులు సిబ్బంది ఆయా శాఖలకు బదలాయింపు
15వ తేదీలోగా ప్రక్రియ పూర్తి
గ్రామ/వార్డు సచివాలయాల్లో సాంకేతిక సిబ్బంది హేతుబద్ధీకరణకు కసరత్తు జరుగుతోంది. ఇకపై సాంకేతిక సిబ్బంది రెండేసి సచివాలయాల్లో సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు దగ్గర దగ్గరగా ఉన్న సచివాలయాలను మ్యాపింగ్ చేస్తున్నారు. ఇతర సిబ్బంది మాత్రం ఏ సచివాలయంలో ఉన్నవారు అక్కడే పనిచేస్తారు.
జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాల్లో 56, జీవీఎంసీలో 551…మొత్తం 607 సచివాలయాలు ఉన్నాయి. నాలుగు గ్రామీణ మండలాల్లో 514 మంది, జీవీఎంసీ పరిధిలో 4,295…మొత్తం 4,809 మంది ప్రస్తుతం ఉన్నారు. మరో 514 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న వారిలో రమారమి 500 మంది వివిధ కారణాలతో సెలవుల్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సచివాలయాలను హేతుబద్ధీకరించి అదనపు సిబ్బందిని ఇతర శాఖలకు పంపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సచివాలయాల్లో సాంకేతిక సిబ్బందికి రెండేసి సచివాలయాలు అప్పగించే కార్యక్రమం చేపట్టింది. గ్రామ సచివాలయాల్లో సాంకేతిక సిబ్బంది జాబితాలో వ్యవసాయ, ఉద్యానవన, సెరికల్చర్, ఫిషరీస్, పశు సంవర్ధక శాఖ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్, ఏఎన్‌ఎం, నగర పరిధిలో ఇంజనీరింగ్, ప్లానింగ్ ఎఎన్‌ఎం, ఎమినిటీస్ సెక్రటరీలు ఉంటారు. సాంకేతిక సిబ్బందిగా పరిగణించే సెక్రటరీలు, అసిస్టెంట్లు ఇకపై దగ్గరదగ్గరగా ఉన్న రెండు సచివాలయాల్లో సేవలు అందించాల్సి ఉంటుంది. అందుకోసం ప్రస్తుతం రెండేసి సచివాలయాలను మ్యాపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మిగిలిన సిబ్బందిని ఆయా ప్రభుత్వ శాఖలకు పంపుతారు. ఉదాహరణకు అగ్రికల్చర్ అసిస్టెంట్లు వ్యవసాయ శాఖకు, ఉద్యానవన అసిస్టెంట్లు సంబంధిత శాఖకు, ఏఎన్‌ఎంలు ఆరోగ్య శాఖకు వెళతారు. ఈ ప్రక్రియ ఈనెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.