మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, సరిగ్గా పనిచేయడంలో సహాయపడుతుంటాయి. వీటిలో కిడ్నీ ఒకటి. ఇది శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది అనేది తెలిసిందే. అందుకే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటానికి అవి ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం అని చెబుతుంటారు వైద్యులు. అయితే, వేగంగా మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు తరచుగా మూత్రపిండాలను కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాయి.
మూత్రపిండాల ఆరోగ్యం, దాని సంబంధిత వ్యాధుల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మార్చి రెండవ గురువారం నాడు ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజు ప్రజలు తమ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించమని ప్రోత్సహిస్తుంటారు. నేడు, ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా, కిడ్నీకి సంబంధించిన కొన్ని సాధారణ సమస్యలు, దానిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.
భారతదేశంలో అధిక రక్తపోటు, మధుమేహ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఇవి ఇది మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి అంటున్నారు నిపుణులు. మూత్రపిండాల వ్యాధులు ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలను చూపించవు కాబట్టి, వాటిని ప్రారంభంలోనే నిర్ధారించడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు లేదా స్ట్రోక్‌తో బాధపడేవారు తమ మూత్రపిండాలను క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవాలి.
ఇవి వంశపారంపర్యంగా వస్తాయి కాబట్టి మీ వంశంలో ఎవరికి అయినా ఈ వ్యాధి ఉంటే మీరు కూడా చెక్ చేయించుకోవడం చాలా అవసరం. వైద్యులు ప్రారంభంలో రెండు పరీక్షలు చేయించుకోవాలని సిఫార్సు చేస్తుంటారు. వాటిలో మూత్ర పరీక్ష, యూరియా క్రియాటినిన్ లు ఉన్నాయి.
కిడ్నీ వ్యాధి అంటే మీ కిడ్నీలు దెబ్బతిన్నాయని, అవి రక్తాన్ని సరిగా ఫిల్టర్ చేయలేవని అర్థం. కొన్ని సాధారణ మూత్రపిండాల సమస్యలలో తీవ్రమైన మూత్రపిండాల గాయం, మూత్రపిండాల తిత్తులు, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రపిండాల ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. అదే సమయంలో, మీకు మూత్రపిండ వైఫల్యం ఉంటే, చికిత్సలో మూత్రపిండ మార్పిడి లేదా డయాలసిస్ వంటివి చేయించకోవచ్చు.
మూత్రపిండాల వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే అప్పుడు మందులు, ఆహారం, శారీరక శ్రమ వంటి జీవనశైలి మార్పులతో చికిత్స చేయవచ్చు. అయితే, వ్యాధి తీవ్రమైన దశకు చేరుకున్నప్పుడు, వైద్యులు దాని ప్రభావాలను తగ్గించే ప్రయత్నాలు చేస్తారు.
అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి ఏవైనా వ్యాధులు ఉంటే లేదా మీరు 60 ఏళ్లు పైబడిన వారైతే, ముందుగా మిమ్మల్ని మీరు క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం మంచిది. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోండి. పుష్కలంగా నీరు త్రాగండి.