తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం (డిసెంబర్ 11) ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది.
పోలింగ్ సమయం ముగిసినా చాలా చోట్ల ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో పోలింగ్ కేంద్రాల గేట్లు మూసి మధ్యాహ్నం 1 గంటల లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల సంఘం అధికారులు.
రాష్ట్రవ్యాప్తంగా యువత, పెద్దలు, వృద్ధులు ఉత్సాహంగా ఓటేశారు. ఫలితంగా ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో భారీగా ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. ఆ వెంటనే గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచ్‌లను ఎన్నుకోనున్నారు. తొలి విడతలో 3,834 సర్పంచ్, 27,628 వార్డ్ మెంబర్ స్థానాలకు పోలింగ్ జరిగింది.
కొన్ని చోట్ల చెల్లాచెదురు ఘటనలు మినహా మిగిలిన అన్నీ చోట్ల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని అబ్జర్వ్ చేశారు. అత్యధికంగా వరంగల్, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు సమాచారం.

































