పంతం నెగ్గించుకున్న గంభీర్‌.. టీమ్‌ఇండియా బౌలింగ్‌ కోచ్‌గా కేకేఆర్ మాజీ పేసర్!

www.mannamweb.com


టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా నియమితుడైన గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) సహాయక సిబ్బందిని ఖరారు చేసుకునే పనిలో పడ్డాడు. ఇప్పటికే శ్రీలంక టూర్‌కు జట్టులో ఎంపిక తన మార్క్‌ చూపించిన గంభీర్.. సహాయక సిబ్బంది విషయంలోనూ తన ముద్ర ఉండేలా చూసుకుంటున్నాడు. తాను సూచించిన వారినే కోచింగ్‌ స్టాఫ్‌లో భాగం చేయాలని బీసీసీఐని కోరాడు. బౌలింగ్‌ కోచ్‌ కోసం ఆర్‌.వినయ్ కుమార్, మోర్నీ మోర్కెల్, లక్ష్మీపతి బాలాజీ పేర్లను గంభీర్‌ బీసీసీఐకి సూచించాడు. మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ‘‘ఫార్మాలిటీస్‌ ఇంకా పూర్తి కాలేదు. కానీ, అవి త్వరలో పూర్తవుతాయని ఆశిస్తున్నాము. శ్రీలంక సిరీస్ తర్వాత మోర్నీ మోర్కెల్‌ బాధ్యతలు స్వీకరించే అవకాశముంది’’ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

మోర్కెల్‌, గంభీర్ గతంలో కలిసి ఆడారు. 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గంభీర్‌ సారథ్యంలో టైటిల్‌ సాధించింది. అప్పుడు మోర్నీ మోర్కెల్ కేకేఆర్‌ జట్టులో ఉన్నాడు. గంభీర్ లఖ్‌నవూకు మెంటార్‌గా ఉన్న సమయంలో మోర్కెల్ లఖ్‌నవూ బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. మోర్కెల్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో కోచ్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కొంతకాలంపాటు పాకిస్థాన్‌ జట్టుకు అతడు బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు అభిషేక్‌ నాయర్‌తో పాటు నెదర్లాండ్స్‌ మాజీ ఆల్‌రౌండర్‌ టెన్‌ డస్కాటే గంభీర్‌ బృందంలోకి అసిస్టెంట్‌ కోచ్‌లుగా రానున్నట్లు సమాచారం.

తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్‌!
శ్రీలంక, భారత్‌ జట్ల మధ్య పల్లెకెలె వేదికగా జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరగనున్నాయి. అనంతరం ఆతిథ్య జట్టుతో టీమ్‌ఇంండియా ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, భారత బౌలింగ్‌ కోచ్‌ నియమాకం ఇంకా పూర్తి కాలేదు. దీంతో శ్రీలంక పర్యటనకు భారత మాజీ ఆటగాడు సాయిరాజ్‌ బహుతులేని తాత్కాలిక బౌలింగ్‌ కోచ్‌గా నియమించినట్లు తెలుస్తోంది. సాయిరాజ్‌ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.