సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలను రాష్ట్రంలో అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుకు విధానం లాంటి పధకాలను విజయవంతంగా ప్రవేశపెట్టిన చంద్రబాబు సర్కార్..
ఇప్పుడు మరో రెండు పధకాలు శ్రీకారం చుట్టేందుకు సిద్దమైంది. ఏపీలోని మహిళలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం స్కీంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
అన్న క్యాంటీన్లను ఆగష్టు 15వ తేదీ నుంచి ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఇక అదే రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పధకాన్ని సైతం మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ పధకం అమలు విధానంపై అధికారులు తుది కసరత్తు చేస్తున్నారట. జూలై 16న జరిగే మంత్రివర్గం సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. ఇక అన్నీ కుదిరితే.. ఆగష్టు 15న సీఎం చంద్రబాబు విశాఖ వేదికగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీంకు పచ్చజెండా ఊపనున్నారు.
మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పధకంపై ఇప్పటికే ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో పధకం అమలవుతున్న తీరుపై అధ్యయనం చేశారు. అందుకు సంబంధించిన నివేదికలను సైతం రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఈ పధకం అమలు తర్వాత ప్రభుత్వంపై పడే ఆర్ధిక భారం ఎంత.? పధకం అమలులో తలెత్తే సమస్యలు ఏంటి.? ఆర్ధికంగా తీసుకోవాల్సిన చర్యలు.? తదితర అంశాలపై ఆర్టీసీ అధికారులు నివేదికలను సిద్దం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రూట్లలోనూ ఈ పధకాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం.