Gautam Gambhir: గంభీర్‌ నెక్ట్స్‌ టార్గెట్‌ అదే.. ప్రధాన కోచ్‌ రూమర్స్‌కు చెక్‌!

www.mannamweb.com


భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్‌ నియామకం అయిపోయిందనే వార్తలు వచ్చాయి. టీ20 ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత.. జులై 1 నుంచి కొత్త కోచ్‌ బాధ్యతలు చేపడతాడని ఇప్పటికే బీసీసీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రముఖులు ఎవరు దరఖాస్తు చేశారనేది ఇంకా తెలియలేదు. కేకేఆర్ మూడోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో గంభీర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడు ఈసారి కోచ్‌గా వచ్చేందుకు మొగ్గు చూపడం లేదని ఈ వ్యాఖ్యలనుబట్టి తెలుస్తోంది.

‘‘మేం ఇప్పటికి మూడు టైటిళ్లను సాధించాం. ముంబయి, చెన్నై కంటే ఇంకా రెండు కప్‌లను వెనుకబడే ఉన్నాం. ఇప్పుడు విజేతలుగా నిలిచినా.. మా టైటిళ్ల వేట కొనసాగుతుంది. ఇప్పటికీ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్ల జాబితాలో మేం లేము. అలా జరగాలంటే మరో మూడు సార్లు ఛాంపియన్‌గా నిలవాలి. దాని కోసం తీవ్రంగా కష్టపడాలి. మా తదుపరి లక్ష్యం అదే. ఐపీఎల్‌లో విజయవంతమైన జట్టుగా కేకేఆర్‌ను నిలపడం కంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. ఇప్పుడు జర్నీ ప్రారంభమైంది’’ అని గంభీర్‌ తెలిపాడు.

నరైన్ అలా అడిగాడు..
సునీల్ నరైన్‌ తనకు సోదరుడిలాంటి వాడని, 2012 సీజన్‌లో మొదటిసారి ఓ ప్రశ్న అడిగినట్లు గంభీర్ గుర్తు చేసుకున్నాడు. ‘‘క్యారెక్టర్ విషయంలో నరైన్‌కు నాకు చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. ఐపీఎల్‌లోకి అతడు 2012లో తొలిసారి అడుగు పెట్టాడు. నాకు ఇప్పటికీ గుర్తుంది జైపుర్‌లో ప్రాక్టీస్‌ చేసిన తర్వాత లంచ్‌కు రమ్మని చెప్పా. అతడు చాలా సిగ్గుపడుతుంటాడు. లంచ్‌ సమయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. ‘నేను నా గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీఎల్‌కు తీసుకురావచ్చా?’ తొలి సీజన్‌ కావడంతో కాస్త భయపడ్డాడు. తర్వాతి నుంచి అద్భుతమైన ఆటతీరుతో జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నేనెప్పుడూ అతడిని జట్టు సభ్యుడిగా చూడను. ఒక సోదరుడిగానే భావిస్తా. ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్‌ దూరంలోనే ఉంటాం. కేవలం కోల్‌కతాకే కాకుండా టోర్నీకే అతడు అత్యంత విలువైన ఆటగాడు. భవిష్యత్తులోనూ చాలా క్రికెట్ ఆడగలడు’’ అని కేకేఆర్‌ మెంటార్ తెలిపాడు.