దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ రోజురోజుకూ పెరిగిపోతోంది. సరికొత్త ఫీచర్లతో అనేక రకాల వాహనాలు సందడి చేస్తున్నాయి. కొనుగోలుదారుల ఆసక్తికి అనుగుణంగా పలు రకాల స్కూటర్ల ఆవిష్కరిస్తున్నారు. వీటిపై కేంద్ర ప్రభుత్వం రాయితీలు కూడా అందజేస్తుంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం దేశంలో గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో అనేక కంపెనీలు తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో గోదావరి ఎలక్ట్రిక్ మోటారు కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇబ్ల్యూ ఫియో ఎక్స్ పేరిట విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. యువతే లక్ష్యంగా ఈ స్కూటర్ ను కంపెనీ డిజైన్ చేసింది. వారి స్టైల్ స్టేట్‌మెంట్‌ను ప్రతిబింబించే విధంగా కాంపాక్ట్, స్టైలిష్ డిజైన్తో ఇది ఆకర్షిస్తుంది. అలాగే ఇది ఐదున్నర గంటల్లో ఫుల్ చార్జింగ్ అవుతుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 110 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
ప్రత్యేకతలు ఇవే..
ఇబ్లూ ఫియో ఎక్స్ ప్రత్యేకతల విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 110 ఎన్ ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎకానమీ, నార్మల్, పవర్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కారణంగా బ్యాటరీపై ఒత్తిడి ఉండదు. స్కూటర్ పొడవు, వెడల్పులు కూడా వినియోగదారులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. దీని వీల్ బేస్ 1345 మిమీ. 170 ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్‌తో శక్తివంతంగా రూపొందించారు.
ఆకట్టుకునే ఐదు రంగుల్లో..
సియాన్ బ్లూ, వైన్ రెడ్, జెట్ బ్లాక్, టెలి గ్రే, ట్రాఫిక్ వైట్ వంటి ఐదు రకాల అందమైన రంగుల్లో ఇబ్ల్యూ ఫియో ఎక్స్ అందుబాటులో ఉంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, డ్యూయల్ ట్విన్ షాకర్, ముందు, వెనుక భాగాలలో సీబీఎస్ డిస్క్ బ్రేక్‌లు సౌకర్యవంతంగా ఉంటాయి. హై రిజల్యూషన్ ఏహెచ్ వో ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు రాత్రి సమయంలో మంచి వెలుతురును అందిస్తాయి. దీని సైడ్ స్టాండ్‌లో సెన్సార్ ఇండికేటర్ రైడర్ అమర్చారు.
విశాలమైన బూట్ స్పేస్..
ఈ స్కూటర్‌లో 28 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. నావిగేషన్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. ఫ్లోర్‌బోర్డ్‌లో విశాలమైన స్థలం ఉంచారు. ఇక్కడ గ్యాస్ సిలిండర్‌ను సులభంగా తీసుకువెళ్లవచ్చు. అలాగే 7.4 అంగుళాల డిజిటల్ ఫుల్-కలర్ డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది.
5.30 గంటల్లో చార్జింగ్..
స్కూటర్‌తో పాటు 60 వోల్ట్‌ల సామర్థ్యం గల హోమ్ ఛార్జర్ అందిస్తారు. దీని ద్వారా స్కూటర్‌ను కేవలం 5 గంటల 30 నిమిషాల్లో పూర్తిగా ఛార్జింగ్ చేయవచ్చు. ఈ స్కూటర్ కు 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీని కంపెనీ అందజేసింది.
ఫైనాన్స్ సౌకర్యం..
ఇబ్ల్యూ ఫియో ఎక్స్ స్కూటర్ కు ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది. ఇది వినియోగదారులకు ఎంతో సౌకర్యంగా కూడా ఉంటుంది. ఐడీబీఐ బ్యాంకు, ఎస్ఐడీబీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పేటెల్, ఈజెడ్ ఫైనాన్స్, ఛత్తీస్ గఢ్ గ్రామీణ బ్యాంకు, రెవ్ ఫిన్, అము లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్, పైసా తదితర సంస్థలు ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నాయి.