మళ్లీ మంచిరోజులొస్తాయి.. ధైర్యంగా ముందుకెళ్దాం: వైఎస్‌ జగన్‌

మళ్లీ మంచిరోజులొస్తాయి.. ధైర్యంగా ముందుకెళ్దాం: వైఎస్‌ జగన్‌


చెప్పిన మంచి పనులన్నీ చేశాం.. రాష్ట్రంలో ప్రతీ కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది, అందుకే ప్రజలకు మన పైనే విశ్వాసం ఉందన్నారు వైఎస్స్‌ఆర్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

మూడు రోజులపాటు సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటించిన ఆయన.. భవిష్యత్‌ కార్యాచరణలో భాగంగా పార్టీ శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

”ఎవరూ అధైర్యపడొద్దు, రాబోవు కాలం మనదే, ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది, మనపట్ల ప్రజలకు విశ్వాసం ఉంది, భవిష్యత్‌ మనదే. నిరంతరం ప్రజాశ్రేయస్సుకు అనుగుణంగా మన పార్టీ శ్రేణులు అడుగులు వేయాలి. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం, మళ్ళీ మంచిరోజులు వస్తాయి” అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

పులివెందుల పర్యటనలో భాగంగా.. వైఎస్‌ జగన్‌కు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభించింది. మూడు రోజులపాటు భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో జగన్‌ మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.

అలాగే.. పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. ”కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు. పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు పార్టీ తోడుగా ఉంటుంది” అని జగన్‌ భరోసానిచ్చారు. అలాగే.. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు, నేతలకు అండగా నిలబడాలని ప్రజాప్రతినిధులకు జగన్‌ సూచించారు.