ఏపీలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు గుడ్‌న్యూస్. జీతాల పెంపు అంశంపై మంత్రి స్పష్టత ఇచ్చారు. విజయవాడలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Gummidi Sandhya Rani) అంగన్వాడీ కార్యకర్తలకు (Anganwadi Workers) మొబైల్స్ పంపిణీ (mobiles Distribution) చేశారు.
5జీ మొబైల్స్ అందజేశారు.
రాష్ట్రంలో 55,706 అంగన్‌వాడీ కేంద్రాలకుగాను మొత్తం 58,204 మంది సిబ్బందికి రూ.75కోట్ల విలువైన మొబైల్స్‌ను మంత్రి గుమ్మడి సంధ్యారాణి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్ వాడీ కేంద్రాలు తల్లిదండ్రుల నమ్మకానికి, వారి ఆశలకు గుర్తుగా నిలుస్తున్నాయని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అందిస్తున్న సేవలు 98శాతం సంతృప్తికరంగా, ఏప్లస్ ప్లస్ స్థాయిలో ఉండడం చాలా సంతోషకరమని మంత్రి ప్రశంసించారు. ఈ గొప్ప సేవలను కొనసాగిస్తూ అంగన్వాడీ సిబ్బంది గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్న పిల్లలకు ఇంకా బాగా సేవలు అందించాలని మంత్రి కోరారు.
అంగన్వాడీలకు ఏది కావాలన్నా చేస్తామని మంత్రి సంధ్యారాణి చెప్పారు. ఈ సందర్భంగా ఆమె కీలక సూచనలు చేశారు. ఎవరో చెప్పారని ధర్నాలతో సమయం వృథా చేసుకోవద్దని అన్నారు. అలాగే వేతనాల పెంపు అంశం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని, గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలనే ప్రతిపాదనను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని మంత్రి పేర్కొన్నారు.
అంగన్వాడీల కోసం ఉపయోగించే యాప్‌ల సంఖ్యను తగ్గించాలని కేంద్రాన్ని కోరామని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ మొబైల్స్ ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వేగంగా సేవలు అందించేందుకు దోహదపడతాయని చెప్పారు. త్వరలోనే అంగన్వాడీ ఉద్యోగులందరికీ ఒకేరకమైన దుస్తులు అందజేస్తామని అన్నారు.



































