ఏపీలో ఉద్యోగులకు, పెన్షనర్లకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదిన్నర కాలంగా ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న హెల్త్ కార్డుల సమస్యలపై మరో ముందడుగు వేసింది.
గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన ఓ హామీని ప్రభుత్వం ఇవాళ నిలబెట్టుకుంది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది.
గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా వారు ఉద్యోగుల ఆరోగ్య పథకంతో పాటు హెల్త్ కార్డుల విషయంలో ఎదురవుతున్న సమస్యల్ని సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఇవాళ ఉద్యోగుల హెల్త్ కార్డులపై ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో ఇచ్చిన హామీ మేరకు అఫీషియల్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అక్టోబర్ 18వ తేదీన సీఎం చంద్రబాబుతో ఉద్యోగ సంఘాల భేటీ సందర్భంగా హెల్త్ కార్డుల సమస్యలపై కమిటీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ ఇవాళ ఏడుగురు సభ్యులతో దీన్ని ప్రకటించారు. సీఎస్ విజయానంద్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీ ఎనిమిది వారాల్లోగా హెల్త్ కార్డుల సమస్యల్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సీఈవో వీటిపై తదుపరి చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
ఈ కమిటీలో సీఎస్ తో పాటు సాధారణ పరిపాలన శాఖకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ప్రధాన కార్యదర్శి లేదా కార్యదర్శుల్లో ఒకరు, హెచ్ ఆర్ వ్యవహారాలు చూస్తున్న ఆర్ధిక శాఖ కార్యదర్శి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి, ఏపీ ఎన్డీవోల అధ్యక్షుడు విద్యాసాగర్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సీఈవో సభ్యులుగా ఉంటారు.
































