విజయవాడ హైవేకు సమాంతరంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి సాధించడానికి కీలక అడుగులు వేస్తోంది.
హైదరాబాద్ సమీపంలోని ఫోర్త్ సిటీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్గం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య పారిశ్రామిక ప్రగతికి ఊతమిస్తుంది అని, రెండు రాష్ట్రాల మధ్య మెరుగైన అనుసంధానంగా ఉంటుందని భావిస్తోంది.
గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఇటీవల కేంద్ర హోంశాఖ నిర్వహించిన ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాల పై జరిగిన సమావేశంలో ఫోర్త్ సిటీ నుండి అమరావతి వరకు ఏర్పాటు చేయదలచిన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి డి పి ఆర్ రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖకు కూడా సూచించింది.
ఫోర్త్ సిటీ నుండి అమరావతికి
కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇటు ఏపీ ప్రభుత్వంతోనూ సమాలోచనలు జరుపుతోంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ విజయవాడ మధ్య 65వ నెంబర్ జాతీయ రహదారికి సమాంతరంగా నిర్మించాలని ఆలోచన చేస్తున్న ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ను హైదరాబాదు నుండి కాకుండా హైదరాబాద్ కు భవిష్యత్తు నగరంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న ఫోర్త్ సిటీ నుంచి నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
విజయవాడ, హైదరాబాద్ ప్రస్తుత జాతీయ రహదారికి సమాంతర రోడ్డు
ఈ క్రమంలో ఈ ఆలోచనను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్ అండ్ బి స్పెషల్ సిఎస్ లతో, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఆర్ అండ్ బి స్పెషల్ సిఎస్ లతో చర్చించారు. అమరావతి ఫోర్త్ సిటీని కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వస్తే ఇది విజయవాడ, హైదరాబాద్ ప్రస్తుత జాతీయ రహదారికి సమాంతర రోడ్డు అవుతుందని చెప్పారు.
పారిశ్రామికంగా ఆ ప్రాంతం అభివృద్ధి
ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారికి అటు ఇటుగా పది కిలోమీటర్ల దూరంలో దీనిని నిర్మిస్తే ఇది ఒక ప్రత్యేక బెల్టులా తయారవుతుందని చెప్పారు. ఈ రోడ్డుతో మధ్యలో ఉన్న ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని, తమ ఆలోచనకు ఏపీ స్పందిస్తూ అభిప్రాయం తెలియజేయాలని కోరారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓడరేవులు లేని కారణంగా ఎగుమతులు దిగుమతుల కోసం తెలంగాణ నుండి ఏపీకి పెద్దఎత్తున రవాణా జరుగుతుంది.
గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు డ్రై పోర్టు, కొత్త రైల్వే లైన్ ప్లాన్
ఈ క్రమంలో వస్తున్నటువంటి ఇబ్బందులను అధిగమించి ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణాను సునాయాసం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించడంతో పాటు అమరావతి నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ హైవేకు హైదరాబాద్ శివారులో ఏర్పాటు చేసే జంక్షన్ వద్ద డ్రై పోర్ట్ నిర్మించాలని భావిస్తోంది. ఇక ఈ డ్రై పోర్ట్ నుండి మచిలీపట్నం నౌకాశ్రయం వరకు కొత్త రైలు మార్గం కూడా నిర్మించాలని ఆలోచన చేస్తుంది.
ఏపీ సానుకూలంగా ఉంటే తెలంగాణా ప్లాన్ వేగవంతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దీనికి సంబంధించి సానుకూలమైన స్పందన వస్తే తెలంగాణ ప్రభుత్వం చేసుకుంటున్న ప్రణాళికల కార్యాచరణ వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే రెండు రాష్ట్రాల మధ్య పారిశ్రామిక ప్రగతి, సరుకు రవాణా వ్యవస్థ పరుగులు పెడుతుంది.
































