ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా విద్యా ప్రమాణాల పురోగతికి కృషి చేస్తున్న కేంద్రం కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలుపగా అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి.
ఏపీలో నాలుగు కేంద్రీయ విద్యాలయాలు
కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయాలు చిత్తూరు జిల్లా మంగ సముద్రం, కుప్పం మండలంలోని బైరుగని పల్లె, శ్రీకాకుళం జిల్లా పలాస, అమరావతిలోని శాఖమూరు లలో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు 5862.55 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తాన్ని 2026- 2027 నుండి ప్రారంభమయ్యే తొమ్మిది సంవత్సరాలలో ఖర్చు చేస్తారు.
కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఈ మొత్తం నుండి భవనాలు మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 2585.52 కోట్లు, నిర్వహణ ఖర్చుల కోసం రూ.3277.03 కోట్లు ఖర్చు చేస్తారు. కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర విద్యారంగం మొత్తానికి కొత్త ఉత్తేజం
కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుతో వెనుకబడిన ప్రాంతాలు లేకుండా రాష్ట్ర విద్యారంగం మొత్తానికి కొత్త ఉత్తేజం వస్తుందని ఆయన అన్నారు. తమిళనాడు సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లా మంగ సముద్రంలో విద్యా అవకాశాలు చాలా పరిమితంగా ఉండటంతో, ఈ కేంద్రీయ విద్యాలయం ఆ లోటును అక్కడ భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. బైరుగని పల్లె వంటి గ్రామీణ ప్రాంతాలలో నాణ్యమైన ఉన్నత విద్యను అందించడం ద్వారా అక్కడ సామాజిక మార్పు సాధ్యమవుతుందని భావిస్తున్నారు.
ఈ ప్రాంతాలలో కేంద్రీయ విద్యాలయాలు అందుకే
శ్రీకాకుళం జిల్లాలోని పలాస వ్యవసాయానికి, మత్స్య సంపదకు పెట్టింది పేరు కావడంతో ఇక్కడ కూడా విద్యావ్యాప్తి ఈ ప్రాంత పురోగతికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతానికి సమీపంలో శాఖమూరు లో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు రాష్ట్ర విద్యాభివృద్ధికి కేంద్ర బిందువుగా మారుతుందని భావిస్తున్నారు.
రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్న కేంద్రం
నాలుగు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు పైన మాట్లాడిన సీఎం చంద్రబాబు ఈ కేంద్రీయ విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ విద్యా రంగానికి కొత్త శకం తీసుకు రాబోతున్నాయి అన్నారు. వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన అవకాశాలు వీటివల్ల లభిస్తాయని, కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేసిందన్నారు. విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
































