ఓలా, ఉబర్‌లకు గుడ్‌బై! ఇండియాలో ‘భారత్ టాక్సీ’ రచ్చ

మీరు తరచుగా ఓలా లేదా ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులను వాడుతున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే అప్‌డేట్! భారత ప్రభుత్వం క్యాబ్ రైడ్స్ కోసం ఓ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది.


అదే భారత్ ట్యాక్సీ (Bharat taxi). ప్రభుత్వ సహకార రంగం ద్వారా ఈ ట్యాక్సీ యాప్‌ లాంచ్ అయింది. ఈ యాప్ పూర్తిస్థాయిలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రాకముందే సంచలనం సృష్టిస్తోంది. రోజుకు సుమారు 45,000 మంది కొత్త వినియోగదారులు ఈ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం టెక్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ రంగంలో ఇదే హాట్ టాపిక్‌.

ఏమిటి ఈ ‘భారత్ టాక్సీ’ ప్రత్యేకత?

మనం వాడుతున్న ఓలా, ఉబర్ వంటి ట్యాక్సీ యాప్స్ టెక్నాలజీతోనే ఈ భారట్ ట్యాక్సీ (Bharat Taxi) కూడా పనిచేస్తుంది. దీనిని ‘సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్’ నిర్వహిస్తోంది. దీని వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారి మార్గదర్శకత్వం ఉండటంతో పాటు.. అమూల్ (Amul), ఇఫ్కో (IFFCO), నాబార్డ్ (NABARD) వంటి దిగ్గజ సంస్థల మద్దతు కూడా ఉంది. అమూల్ ఎండీ జయేన్ మెహతా దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

డ్రైవర్లకు 100% సంపాదన!

ప్రైవేట్ కంపెనీలు డ్రైవర్ల సంపాదనలో 20 నుంచి 30 శాతం వరకు కమిషన్ రూపంలో కట్ చేసుకుంటాయి. కానీ, భారత్ ట్యాక్సీ (Bharat Taxi) లో ‘జీరో కమిషన్’ విధానం ఉంది. అంటే ప్రయాణికుడు ఇచ్చే పూర్తి డబ్బు డ్రైవర్ జేబుకే వెళ్తుంది. డ్రైవర్లే ఈ కోఆపరేటివ్ సొసైటీలో వాటాదారులుగా ఉంటారు. దీనివల్ల డ్రైవర్లకు ఎక్కువ లాభం కలగడమే కాకుండా.. ప్రయాణికులకు కూడా సరసమైన ధరలకే ప్రయాణం లభిస్తుంది.

కస్టమర్లకు కలిగే ప్రయోజనాలు..

  • సర్జ్ ప్రైసింగ్ లేదు: వర్షం పడినా లేదా రద్దీ ఎక్కువగా ఉన్నా సరే.. ఛార్జీలు పెరగవు. ఫిక్స్‌డ్ రేట్లే ఉంటాయి.
  • భద్రతకు పెద్దపీట: డ్రైవర్లందరూ పోలీస్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నవారే ఉంటారు. లైవ్ ట్రాకింగ్, 24/7 మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ ఉంటుంది.
  • రకరకాల ఆప్షన్లు: ఆటోలు, బైక్‌లు, ట్యాక్సీలతో పాటు ఇంటర్‌సిటీ ప్రయాణాలకు కూడా దీనిని వాడుకోవచ్చు.
  • సులభమైన యాప్: ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ (iOS) రెండింటిలోనూ ‘Bharat Taxi’ యాప్ అందుబాటులో ఉంది.

హైదరాబాద్‌లోకి ఎప్పుడు వస్తుంది?

అయితే ప్రస్తుతం ఢిల్లీ, గుజరాత్‌లో లాంచ్ అయిన ఈ యాప్.. జనవరి 1, 2026 నుండి తన కార్యకలాపాలను విస్తరించింది. త్వరలోనే ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఈ సేవలను విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో అడుగు

డ్రైవర్లను యజమానులుగా మార్చే ఈ సహకార మోడల్ ఖచ్చితంగా మార్కెట్‌లో ఉన్న గుత్తాధిపత్యాన్ని దెబ్బతీస్తుంది అని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే 4 లక్షల మంది కస్టమర్లు రిజిస్టర్ అయ్యారంటేనే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా సామాన్యులకు భరోసానిచ్చే రవాణా వ్యవస్థగా భారత్ ట్యాక్సీ (Bharat Taxi) అవతరించబోతోంది. ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్ కావడంతో భారతీయులు కూడా దీనికి బ్రహ్మరథం పడుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.