ఏపీలో గూగుల్‌ ఏఐ

www.mannamweb.com


రాష్ట్ర ప్రభుత్వంతో ఐటీ దిగ్గజం ఒప్పందం

పాఠశాల, కళాశాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ

మార్పులకనుగుణంగా అవకాశాల కల్పన

అధునాతన ఆవిష్కరణలకూ సహకారం

కీలక రంగాల్లో ఏఐ సేవలు

లోకేశ్‌ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు

చంద్రబాబుతో గూగుల్‌ ప్రతినిధుల భేటీ

ఇదో గొప్ప ముందడుగని సీఎం హర్షం

అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సేవలు విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి. యువతకు ఏఐలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడంతో పాటు ఈ రంగంలో అధునాతన సాంకేతిక ఆవిష్కరణలకు సంపూర్ణ సహకారం అందించేలా ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ గూగుల్‌ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం వెలగపూడి సచివాలయంలో మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో గూగుల్‌ మ్యాప్స్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ లలితా రమణి, ఏపీ రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ శాఖ కార్యదర్శి సురేశ్‌కుమార్‌ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా యువత అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది.

ఈ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఏఐ రంగంలో వస్తున్న సాంకేతిక నైపుణ్యాలపై పాఠశాల,కళాశాల విద్యార్థులకు గూగుల్‌ శిక్షణ ఇవ్వనుంది. అలాగే స్టార్టప్‌ లు, సంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఏఐ ఆధారిత సేవల కోసం శిక్షణా కార్యక్రమాలను చేపడుతుంది. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణం, సుస్థిరత లాంటి కీలకాంశాల్లో ఏఐ అండ్‌ ఎంఎల్‌ సొల్యూషన్‌ను ఏకీకృతం చేయడానికి గూగుల్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది. ఏఐ ఆధారిత వ్యవస్థ ద్వారా ఆర్థిక వృద్ధికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను చేపడుతుంది. ఈ కార్యక్రమంలో ఈడీబీ సీఈవో సాయికాంత్‌వర్మ, ఆర్టీజీఎస్‌ సీఈవో దినేశ్‌కుమార్‌, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి యువరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏఐతో సానుకూల ప్రయోజనాలు: గూగుల్‌

పరిపాలనా వ్యవస్థలో ఏఐ ఉపయోగించడం ద్వా రా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందించాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా ఈ ఒప్పందం చేసుకున్నామని గూగుల్‌ మ్యాప్స్‌ జనరల్‌ మేనేజర్‌ లలితా రమణి అన్నారు.

సీఎంతో గూగుల్‌ బృందం భేటీ

ఒప్పందం చేసుకోవడానికి ముందు చంద్రబాబు తో గూగుల్‌ క్లౌడ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ కంట్రీ ఎండీ విక్రమ్‌సింగ్‌ బేడీ బృందం సమావేశమైంది. ఒప్పందాన్ని ఒక గొప్ప ముందడుగా చంద్రబాబు అభివర్ణించారు.

ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ మా లక్ష్యం

ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ మా ప్రభుత్వ లక్ష్యం. ప్రజలు తమకు అవసరమైన వివిధ రకాల సర్టిఫికెట్లు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, వారే సెల్‌ఫోన్‌ వంటి పరికరాల ద్వారా పొందేందుకు ఏఐ ఉపయోగపడుతుంది. యువతకు ఏఐ ఆధారిత భవిష్యత్తు అవకాశాలను కల్పించేందుకు ఏపీతో గూగుల్‌ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం. క్లిష్టమైన రంగాల్లో ఏఐ సేవలను వినియోగించడం ద్వారా కార్యకలాపాలను సులభతరం చేయవచ్చు. ఏఐ ఆధారిత వర్క్‌ఫోర్సును సిద్ధం చేయడంలో గూగుల్‌ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ ఒప్పందం ద్వారా యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందుబాటులోకి వస్తుంది. తద్వారా అపార అవకాశాలు లభిస్తాయి.

– లోకేశ్‌, రాష్ట్ర మంత్రి

ఒప్పందంలోని కీలకాంశాలు

విద్యా నైపుణ్యాభివృద్ధి

విద్యార్థులు, డెవలపర్లకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత నైపుణ్యాల కోసం 10 వేలమందికి గూగుల్‌ ఎసెన్షియల్‌ పేరుతో నైపుణ్య శిక్షణ కోర్సును అందిస్తుంది. రోజువారీ జీవితంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఎలా ఉపయోగించాలి, ఏఐ ద్వారా ఉత్పాదకతా సామర్థ్యం ఎలా పెంచాలి వంటి అంశాలు ఈ కోర్సులో అంతర్భాగంగా ఉంటాయి. సైబర్‌ సెక్యూరిటీ, డేటా ఎనలిటిక్స్‌, జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి రంగాల్లో గూగుల్‌ క్లౌడ్‌ సర్టిఫికేషన్లు, స్కిల్‌ బ్యాడ్జ్‌లను గూగుల్‌ అందజేస్తుంది. ప్రభుత్వ ఏజెన్సీల కోసం స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్‌లను అందించడానికి గూగుల్‌ క్లౌడ్‌ సహకరిస్తుది. స్కిల్లింగ్‌ ఇనీషియేషన్‌లలో గూగుల్‌ డెవలపర్‌ కమ్యూనిటీ ప్రోగ్రామ్‌లు, ఆండ్రాయిడ్‌ యాప్‌ స్కిల్లింగ్‌ డెవల్‌పమెంట్‌ ట్రైనింగ్‌లకు గూగుల్‌ ద్వారా యాక్సెస్‌ లభిస్తుంది.

ఎకో సిస్టమ్‌కు సహకారం

స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ ఎనేబుల్‌మెంట్‌, మెంటర్‌షిప్‌, ఎంటర్‌షిప్‌, నెట్‌వర్కింగ్‌ అవకాశాలు అందుతాయి. స్టార్టప్‌ యాక్సిలరేటర్‌ ప్రోగ్రామ్‌ల కోసం గూగుల్‌ ఆంధ్రప్రదేశ్‌ స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌తో కలసి పనిచేస్తుంది.

సుస్థిరత

గాలి నాణ్యత, పట్టణ ప్రణాళిక, విపత్తు నిర్వహణకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడంలో గూగుల్‌ ఏఐ ఆధారిత సేవలను అందిస్తుంది.

హెల్త్‌ కేర్‌

నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడంలో ఏఐ అప్లికేషన్‌లను అన్వేషించడం, హెల్త్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ డెవల్‌పమెంట్‌ ఫౌండేషన్స్‌ (హాయ్‌-డీఈఈ) ద్వారా పరిశోధనా కార్యక్రమాలకు గూగుల్‌ మద్దతు ఇస్తుంది.

ఏఐ పైలట్‌లు

వ్యవసాయం, ట్రాఫిక్‌ నిర్వహణ, వెబ్‌సైట్‌ ఆధునీకరణ, పౌరుల ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలలో క్లౌడ్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రయోజనాలపై పైలట్‌ ప్రాజెక్టులకు గూగుల్‌ సహకరిస్తుంది.