గూగుల్‌ సంచలన ప్రకటన.. ఇక అన్నీ క్రోమ్‌ లోనే

ఇంటర్నెట్‌ను మనం ఉపయోగించే విధానం పూర్తిగా మారబోతోందా..? అనే ప్రశ్నకు గూగుల్ తాజా ప్రకటన “అవును” అనే సమాధానం ఇస్తోంది.


టిక్కెట్లు బుక్ చేయడం నుంచి ఆన్‌లైన్ ఫారమ్‌లు నింపడం, షాపింగ్ చేయడం వరకు.. ఇకపై ఈ పనులన్నీ గూగుల్ క్రోమ్ స్వయంగా చేయగలదు. దీనికి కారణం.. క్రోమ్‌లోకి వస్తున్న కొత్త AI ఏజెంట్ ఫీచర్. ఇప్పటివరకు ఒక వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేయాలంటే ఫారమ్ నింపాలి, ఆప్షన్లు ఎంచుకోవాలి, పేమెంట్ చేయాలి. ఇవన్నీ మనమే చేయాల్సి వచ్చేది. కానీ, గూగుల్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌తో, మీరు కేవలం ఒక ఆదేశం ఇస్తే చాలు.. మిగతా పని అంతా క్రోమ్ చూసుకుంటుంది.

ఉదాహరణకు, ఈ వెబ్‌సైట్ నుంచి నా ట్రైన్ టికెట్ బుక్ చేయి అని క్రోమ్‌కు చెప్పగలిగితే.. AI పేజీని అర్థం చేసుకుని, బటన్‌లను గుర్తించి, అవసరమైన వివరాలు పూరించి, ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఈ విధానాన్ని టెక్ ప్రపంచంలో AI ఏజెంట్ బ్రౌజింగ్ లేదా ఆటో బ్రౌజ్ అని పిలుస్తున్నారు. ఇప్పటికే పెర్ప్లెక్సిటీ సంస్థ తీసుకొచ్చిన కామెట్ బ్రౌజర్, అలాగే OpenAI యొక్క ప్రయోగాత్మక బ్రౌజర్ ATLAS ఈ కాన్సెప్ట్‌తో వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు గూగుల్ కూడా వెనుకబడి ఉండకుండా, తన శక్తివంతమైన జెమిని AIని నేరుగా క్రోమ్‌లోకి తీసుకొస్తోంది.

జెమినితో క్రోమ్ ఒక డిజిటల్ అసిస్టెంట్
ఇప్పటివరకు AI టూల్స్ అంటే చాట్ చేయడానికే పరిమితం. ప్రశ్న అడిగితే సమాధానం ఇచ్చేవి. కానీ, ఇప్పుడు జెమిని AI వెబ్ పేజీలతో నేరుగా ఇంటరాక్ట్ అవుతుంది. అది స్క్రీన్‌పై ఉన్న టెక్స్ట్, బాక్స్‌లు, బటన్‌లు, ఫారమ్‌లు.. ఇలా అన్నింటినీ గుర్తించి, మీ సూచనల ప్రకారం చర్యలు తీసుకుంటుంది. అంటే క్రోమ్ ఇక కేవలం బ్రౌజర్ కాదు.. మీ తరపున పని చేసే వెబ్ అసిస్టెంట్ అన్నమాట..

ఎవరికీ ఇది గేమ్ ఛేంజర్?
ఈ ఫీచర్ ముఖ్యంగా ఆన్‌లైన్ ఫారమ్‌లకు భయపడే వారు.. మొదటిసారి ఇంటర్నెట్ వాడేవారు.. వృద్ధులు.. టెక్నికల్ వెబ్‌సైట్‌లతో గజిబిజి పడే వారు.. ఇలా వీళ్లందరికీ పెద్ద ఊరటగా మారనుంది. కోడింగ్, రీసెర్చ్, ఆన్‌లైన్ షాపింగ్ లాంటి పనుల్లో కూడా ఇది సమయాన్ని భారీగా ఆదా చేస్తుంది. మరోవైపు.. ఇంత ఆటోమేషన్ ఉంటే భద్రత ఎలా..? అనే సందేహం సహజమే. దీనిపై గూగుల్ స్పష్టత ఇచ్చింది. వినియోగదారి అనుమతి లేకుండా ఏ పని జరగదు.. పేమెంట్లు, కీలక ఫారమ్‌లు యూజర్ కన్ఫర్మేషన్‌తోనే.. డేటా బ్రౌజర్‌లోనే ప్రాసెస్ అవుతుంది.. వ్యక్తిగత సమాచారం అనుమతి లేకుండా షేర్ కాదు.. అని గూగుల్ క్లారిటీ ఇచ్చింది..

ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఎంపిక చేసిన వినియోగదారులకు దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. రాబోయే నెలల్లో మరింత మంది Chrome యూజర్లు దీనిని ఉపయోగించగలుగుతారు. ఇది, ఇంటర్నెట్ వినియోగానికి కొత్త యుగంగా చెప్పవచ్చు.. ఇప్పటివరకు మనం వెబ్‌సైట్‌లను నిర్వహించేవాళ్లం.. ఇకపై మనం AIకి ఆదేశాలు ఇస్తాం.. పనంతా బ్రౌజర్ చేస్తుంది. సరళంగా చెప్పాలంటే, Chrome ఇక బ్రౌజర్ కాదు.. మీ వ్యక్తిగత వెబ్ అసిస్టెంట్.. అందుకే గూగుల్ తీసుకొస్తున్న ఈ అప్డేట్ టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. ఇది కేవలం ఒక కొత్త ఫీచర్ కాదు… మనం ఇంటర్నెట్‌ను ఎలా ఉపయోగిస్తామో దానికి కొత్త ఆరంభం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.