తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు కార్పొరేట్ బడుల్లో ఉచితంగా నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రారంభించింది.
ఇందుకోసం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (B.A.S) ను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తుంది. ప్రయివేట్ స్కూళ్లల్లో ప్రవేశానికై ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. అయితే రాష్ట్రంలో ఇలాంటి పాఠశాలలు 238 ఉండగా, ఇందులో ఎస్సీ విద్యార్థులు 23,000 మంది, ఎస్టీ విద్యార్థులు 7000 మంది విద్యను అభ్యసిస్తున్నారు. 1వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ. 28,000. 05వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 42,000లు ప్రభుత్వమే భరిస్తుంది. అట్టి విద్యార్థులకు విద్య, భోజన వసతి, యూనిఫామ్స్, షూస్, పుస్తకాలు, నోట్ బుక్కులు వంటి సౌకర్యాలు స్కాలర్షిప్ రూపంలో ప్రభుత్వం భరించాలి. గత 4 సంవత్సరాల నుండి ఈ విద్యార్థులకు 280 కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించలేక ఆయా పాఠశాలల యాజమాన్యాలు చేతులెత్తేసి విద్యార్థులను తరగతులకు రానివ్వకుండా, విద్యకు దూరం చేస్తూ పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బకాయి బిల్లులు చెల్లిస్తేనే తరగతి గదుల్లోకి పంపుతామని డిమాండ్ చేస్తూ దళిత విద్యార్థులను ఇక్కట్లకు గురి చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 20 కోట్ల బకాయిలు పేరుకు పోవటంతో యాజమాన్యాలు విద్యార్థుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అయితే ఈ స్కీం కింద ఎంపికైన స్కూల్స్ విద్యార్థులను బయటకు పంపడంపై ఆగ్రహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే పాఠశాల యాజమాన్యాలు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలి తప్ప విద్యార్థులను బయటికి పంపడానికి వీలులేదని హెచ్చరించారు. అయితే ఆ పాఠశాలల యజమానులు ఇప్పుడు ఊరికే ఉన్నా తర్వాత అయినా విద్యార్థులను ఇబ్బంది పెడతారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను విడుదల చేసి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
































