రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ షాక్‌.. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారిపై అధిక ప్రభావం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని భావిస్తే, దేశంలోనే అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం గృహ రుణ గ్రహీతలకు షాకిస్తూ.. కొత్తగా రుణాలు తీసుకునేవారికి వర్తించే వడ్డీ రేట్లను 25 శాతం బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ తాజా నిర్ణయంతో గృహ రుణాల వడ్డీ రేట్ల గరిష్ఠ పరిమితిని పెంచారు. ఇది ముఖ్యంగా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న కస్టమర్లపై అధికంగా పడనుంది. వారు ఇప్పుడు మరింత ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ప్రజలపై రుణ భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఆర్‌బీఐ వరుసగా మూడుసార్లు రెపో రేటును 5.5 శాతానికి తగ్గించింది. సాధారణంగా రెపో రేటు తగ్గితే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (EBLR) తో అనుసంధానమైన రుణాలు చౌకగా మారాలి. దేశంలోని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణాలలో దాదాపు 60 శాతం ఈబీఎల్ఆర్ ఆధారితమైనవే. రెపో రేటు తగ్గింపుతో రుణాలు చౌకగా మారతాయని గతంలో ఎస్‌బీఐ రీసెర్చ్ విభాగమే ఒక నివేదికలో పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు 7.35% నుంచి 10.10% మధ్య వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో మిగిలిన బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గించడం రుణ గ్రహీతలకు ప్రయోజనకరమే అయినా, బ్యాంకుల లాభాల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతోందని ఎస్‌బీఐ వర్గాలు అంతర్గతంగా హెచ్చరించాయి. ఈ ఒత్తిడే తాజా పెంపునకు కారణంగా తెలుస్తోంది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.