Hair Growth: జుట్టు పెరుగుదలకు తోడ్పడే నేచురల్‌ జ్యూస్‌.. దీనితో ఐదు రెట్లు పెరగనున్న హెయిర్ గ్రోత్

www.mannamweb.com


Hair Growth : శీతాకాలం జుట్టుకు సంబంధించిన సమస్యలు చికాకు పెడుతుంటాయి. స్కాల్ప్‌ పొడిబారడంతో పాటు చుండ్రులాంటివి ఇబ్బంది కలుగజేస్తుంటాయి. కాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడైనా మన జుట్టు(Hair) ఆరోగ్యకరంగా ఉండాలని అందరికీ ఉంటుంది.
మన లైఫ్‌ స్టైల్‌(Life Style)లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా పొడవాటి, కాంతివంతమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. అయితే తరతరాలుగా ఫాలో అవుతున్న ఓ చిట్కా, జుట్టును ఐదింతలు వేగంగా పెరిగేలా చేస్తుందని చాలామంది చెబుతున్నారు.

సహజమైన పదార్థాలతో ఇంట్లోనే తయారు చేసుకునే ఈ జ్యూస్‌, జుట్టుకు కావాల్సిన పోషకాలన్నింటినీ చక్కగా అందించగలుగుతుంది.

ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టుకు కెమికల్‌ ఉత్పత్తుల వాడకం వల్ల వచ్చే నష్టాలను గుర్తించారు. సహజంగా తమ జుట్టును కాపాడుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అటువంటి సహజమైన హెయిర్ కేర్ (Hair Care) హోం రెమెడీ (Home Remedy) ఒకటి ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది.

ఇప్పుడు నెట్‌లో ఇది హల్‌చల్‌ చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జుట్టు పెరుగుదల(Hair Growth)కు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉండటంతో అంతా ఈ విధానం ఏంటా అని ఆసక్తి చూపిస్తున్నారు.

ఏమిటా జ్యూస్..?

బీట్‌రూట్, ఉసిరి, అల్లం, కరివేపాకు, నీరు కలిపి తయారు చేసే ఈ జ్యూస్‌ జుట్టుకు ఎంతో మేలు చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఉసిరి జుట్టును ఆరోగ్యంగా కండిషన్‌లో ఉంచుతుంది. అల్లం జుట్టు పొడవు కావడంలో, రాలకుండా ఉండటంలో సహాయపడుతుంది.

బీట్‌రూట్, కరివేపాకులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే వీటితో తయారు చేసే నేచురల్‌ జ్యూస్‌, రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు స్కాల్ప్‌లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో జుట్టు వేగంగా పెరుగుతుంది. మామూలుగా జుట్టు పెరిగే వేగంతో పోలిస్తే, ఈ జ్యూస్‌తో ఐదు రెట్లు ఎక్కువ వేగంగా జుట్టు పెరుగుతుందట.

ఎలా తయారు చేస్తారంటే?

ఈ జ్యూస్‌ తయారు చేసుకోవడానికి.. ఒక బీట్‌రూట్, 10 నుంచి 12 కరివేపాకులు, ఒక ఉసిరికాయ, ఒక టేబుల్‌ స్పూన్‌ అల్లం, అరకప్పు నీళ్లు ఉంటే చాలు. ముందు బీట్‌రూట్‌, కరివేపాకు, ఉసిరికాయ, అల్లంలను శుభ్రంగా కడగండి. తర్వాత మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయండి. అవసరాన్ని బట్టి నీటిని యాడ్‌ చేయండి.

తర్వాత ఒక గిన్నె పైన మస్లిన్‌ గుడ్డను వేసి ఆ మిశ్రమాన్ని వడగట్టండి. ఫిల్టర్‌ అయిన ఆ జ్యూస్‌ తాగడానికి రెడీ అయినట్లే. దీన్ని నేరుగా తాగొచ్చు. జుట్టు పెరుగుదలను మరింత ప్రోత్సహించడానికి జుట్టు కుదుళ్లకు కూడా దీన్ని అప్లై చేయవచ్చు.

అయితే ఈ జ్యూస్ బెనిఫిట్స్ గురించి ప్రచారంలో ఉన్న వివరాలను ఏ నిపుణులూ అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ ఈ డ్రింక్ మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తోంది.