MS Dhoni: ధోనీతో అతడిని పోలుస్తారా? పాక్‌ జర్నలిస్ట్‌పై హర్భజన్ ఆగ్రహం

www.mannamweb.com


MS Dhoni: ధోనీతో అతడిని పోలుస్తారా? పాక్‌ జర్నలిస్ట్‌పై హర్భజన్ ఆగ్రహం

పాకిస్థాన్‌కు చెందిన ఓ జర్నలిస్ట్‌పై భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌ సింగ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమ్‌ఇండియా దిగ్గజ ఆటగాడితో తమ దేశ క్రికెటర్‌ను పోల్చడమే దానిక్కారణం. ఇంతకీ ఆ స్టార్‌ ఎవరంటే? భారత్‌కు రెండు వరల్డ్‌ కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni). పాకిస్థాన్‌ క్రికెట్‌లో నాణ్యమైన ఆటగాడిగా పేరొందుతోన్న మహ్మద్‌ రిజ్వాన్‌ను ధోనీతో పోలుస్తూ ఆ దేశ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడమే వివాదంగా మారింది. వీరిద్దరిలో ‘ఎవరు’ అత్యుత్తమం? అని ఫొటోకు క్యాప్షన్ జోడించాడు. దీంతో హర్భజన్‌ కాస్త ఘాటుగానే స్పందించాడు. ప్రపంచ క్రికెట్‌లో నంబర్‌వన్ కెప్టెన్‌గా పేరొందిన ధోనీతో ఎక్కువ అనుభవం లేని ఆటగాడిని పోల్చడం సరైంది కాదని విమర్శించాడు. రిజ్వాన్‌ బ్యాటింగ్‌ సత్తాను తక్కువ చేయనని, ధోనీతో సరితూగే ప్లేయర్‌ మాత్రం కాదని స్పష్టం చేశాడు.

‘‘ఈ రోజుల్లోనూ ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం దారుణం. రిజ్వాన్‌ కంటే ధోనీ చాలా ముందున్నాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. నిజాయతీగా సమాధానం ఇవ్వాలి. రిజ్వాన్‌ ఆటను నేను కూడా ఇష్టపడతా. నిబద్ధతతో ఆడేందుకు ఎల్లవేళలా ప్రయత్నిస్తాడు. అయితే, ధోనీతో రిజ్వాన్‌ను పోల్చడం తప్పు. ఇప్పటికీ ప్రపంచ క్రికెట్‌లో అతడే నంబర్ వన్. వికెట్ల వెనుక అత్యంత చురుగ్గా వ్యవహరించిన వికెట్‌ కీపర్లు చాలా అరుదు. ఆ జాబితాలో ధోనీనే టాప్’’ అని హర్భజన్ సింగ్ (Harbhajan Singh) వ్యాఖ్యానించాడు.

వన్డే, టీ20 ప్రపంచ కప్‌లతోపాటు (T20 World Cup) ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా ధోనీ నాయకత్వంలోని భారత్ నిలిచింది. నాలుగేళ్ల కిందటే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ఇప్పుడు ఐపీఎల్‌లోనే ఆడుతున్నాడు. గతేడాది సీజన్‌ వరకు చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ధోనీ సారథ్యంలోనే సీఎస్కే ఐదు ట్రోఫీలు నెగ్గింది. ఈ సీజన్‌లో చెన్నై మ్యాచ్‌ ఎక్కడ జరిగినా అభిమానులంతా ధోనీ కోసమే వచ్చారు.