Hardik Pandya: ‘మాటలు పడి’లేచిన కెరటం… పాండ్య

www.mannamweb.com


Hardik Pandya: ‘మాటలు పడి’లేచిన కెరటం… పాండ్య

బంతికో పరుగు చేస్తే దక్షిణాఫ్రికా మ్యాచ్‌ గెలిచే పరిస్థితి.. ఆ సమయంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) చేతి నుంచి బాల్‌ అందుకున్నాడు. సిక్సర్లతో డీల్‌ చేస్తున్న క్లాసెన్‌ను చక్కటి స్లో బాల్‌తో బోల్తా కొట్టించాడు.

ఆఖరి ఓవర్‌లో కావాల్సింది 16 పరుగులు.. క్రీజులో మిల్లర్‌. మరోసారి వికెట్లకు దూరంగా బంతిని సంధించాడు అదే బౌలర్‌. బౌండరీ దాటి సిక్స్‌ వెళ్లిపోతుందేమో అనుకుంటుండగా.. సూర్య రిలే క్యాచ్‌కు మిల్లర్‌ ఔటయ్యాడు.

భారత్‌ ప్రపంచకప్‌ (T20 World Cup 2024) గెలవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అయితే ఈ రెండు వికెట్లు, ఆ రెండు ఓవర్లు విజయానికి అతి పెద్ద కారణాలు అని చెప్పొచ్చు. ఈ రెండు ఓవర్లు వేసింది హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) అని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మామూలుగా అయితే ఆ రెండు ఓవర్లు, విజయం ఏ బౌలర్‌కైనా స్పెషల్‌. అయితే హార్దిక్‌ పాండ్యకు ఇంకా ఇంకా స్పెషల్‌. ఎందుకంటే ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు పాండ్యను గేలి చేయని నోరు లేదు. జట్టులో ఎందుకు? అని ప్రశ్నించని వ్యక్తి లేడు. ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శనతో గ్రౌండ్‌లోనే నానా మాటలు అన్నారు. కొందరు మాజీలు అయితే తూలనాడారు.

ఇప్పుడు అదుర్స్‌ అంటున్నారు..
హార్దిక్‌ మైదానంలో అడుగుపెడితే గేలి చేయడం.. ముంబయి కెప్టెన్‌గా ఎందుకు వచ్చావంటూ ఎగతాళి చేయడం.. ఆల్‌రౌండర్‌గా విఫలమవడంతో విపరీతంగా విమర్శించడం.. ఈ ఏడాది ఐపీఎల్‌లో జరిగిందిదే. కానీ, ఇప్పుడు అతని బ్యాటింగ్‌ అద్భుతమంటూ.. అతని బౌలింగ్‌ అదుర్స్‌ అంటూ పొగిడేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌ పాత్రకు న్యాయం చేశాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ తేడాకు కారణం హార్దిక్‌ కష్టం. ఈ మార్పునకు కారణం అతడి దృఢ సంకల్పం. తన మీద తను పెట్టుకున్న నమ్మకం. హార్దిక్‌ స్థానంలో మరే ఆటగాడు ఉన్నా పీడకల లాంటి ఆ ఐపీఎల్‌ అనుభవం నుంచి ఇంత త్వరగా కోలుకుని, తిరిగి సత్తాచాటేవాడు కాదేమో! ప్రపంచకప్‌ జట్టులో ఎంపికైనా ఏ పేలవ ప్రదర్శనో చేసి అసలు తుది జట్టులో ఉండేవాడే కాదేమో.

పీడకల లాంటి ఐపీఎల్‌
ఈ సీజన్‌కు ముందు రోహిత్‌ స్థానంలో హార్దిక్‌కు ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీ అప్పజెప్పడంతో ఆ జట్టు, హిట్‌మ్యాన్‌ అభిమానులు తీవ్ర అసంతృప్తి ప్రదర్శించారు. ఆ అసహనాన్ని హార్దిక్‌పై చూపించారు. అతని సారథ్యంలో జట్టు కూడా పేలవ ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచింది. వ్యక్తిగతంగానూ హార్దిక్‌ విఫలమయ్యాడు. 13 ఇన్నింగ్స్‌లో 216 పరుగులు చేయడంతో పాటు కేవలం 11 వికెట్లే పడగొట్టాడు. దీంతో అతడికి ప్రపంచకప్‌లో చోటు దక్కడమూ సందేహంగా మారింది. కానీ అతని నైపుణ్యాలపై నమ్మకముంచిన అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఓ అవకాశం ఇచ్చింది.

జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు వేరే హార్దిక్‌ను చూస్తామని, అతడు పుంజుకుంటాడని ఈ టోర్నీ ఆరంభానికి ముందు మాజీలు అభిప్రాయపడ్డారు. ఆ మాటలను నిజం చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పూర్తి ఆత్మవిశ్వాంతో బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించాడు. ఈ మెగా టోర్నీలో నిలకడగా బౌలింగ్‌ చేసి 8 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. 151.57 స్ట్రయిక్‌ రేట్‌తో 144 పరుగులు చేశాడు. చేసిన పరుగులూ, తీసిన వికెట్లు జట్టు అతి కష్టం మీద ఉన్నప్పటివే అన్న విషయం గుర్తుంచుకోవాలి.

నవ్విన నాప చేనే పండుతుంది అని వినే ఉంటారు.. ఇప్పుడు అదే చేసి చూపించాడు హార్దిక్‌ పాండ్య. తనను గేలి చేసినవారికి గెలిచి చూపించాడు. ఏకంగా కుటుంబ విషయాలను చర్చలోకి లాగిన వారికి విజయంతో చెంప చెళ్లుమనిపించాడు. ఫైనల్‌ మ్యాచ్‌ విజయం తర్వాత పాండ్య కన్నీటిలో గెలిచిన ఆనందం కనిపిస్తుంది. అంతేకాదు ఇన్నాళ్లూ గుండెల్లో దాచుకున్న అవమాన భారాన్ని కూడా దించేసుకున్నాడు అనిపించకమానదు.