రాబోయే 5 రోజులు వర్షాల బీభత్సం.. వాతావరణ శాఖ బిగ్ అప్డేట్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం తమిళనాడు తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఈ వ్యవస్థ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్ర తీరాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.


దీని ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పిడుగులు, ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

తీర ప్రాంతాల్లో గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని కూడా హెచ్చరించారు. ఇప్పటికే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 1 NDRF, 4 SDRF బృందాలు ప్రభావిత జిల్లాలకు పంపించారని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది.

బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి నెల్లూరు జిల్లా మర్రిపాడు (89.2 మి.మీ.), మొగిలిచెర్ల (79 మి.మీ.), కృష్ణా జిల్లా భవదేవరపల్లి (75 మి.మీ.), ప్రకాశం జిల్లా ఉమారెడ్డిపల్లె (62.2 మి.మీ.), గుంటూరు జిల్లా దుగ్గిరాల (61.5 మి.మీ.) ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. అల్పపీడనం త్వరలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపైనా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాబోయే నాలుగు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వెల్లడించింది.

ప్రజలు వర్షాల సమయంలో బయటకు వెళ్లడం తగ్గించాలని, ఎలక్ట్రిక్‌ లైన్‌లు, నీటి గుంతలు, చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. వర్షాలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉండటంతో విపత్తు నిర్వాహక బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.