బాలీవుడ్ నటుడు గోవింద ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఆదివారం తెల్లవారుజామున హీరో సొంత లైసెన్స్ రివాల్వర్ మిస్ ఫైర్ కావడంతో అతడి కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది.
దీంతో నటుడిని ముంబైలోని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శస్త్రచికిత్స చేసి నటుడి కాలులోని బుల్లెట్ ను వైద్యులు తొలగించారు. ప్రస్తుతం తన తండ్రి క్షేమంగా ఉన్నారని.. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించాలని అన్నారు గోవింద కుమార్తె టీనా. అతడిని ఐసీయు నుంచి సాధారణ వార్డుకు మార్చారని.. త్వరలోనే డిశ్చార్జ్ చేయనున్నారని తెలిపారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు ఆసుపత్రికి చేరుకుని నటుడు గోవిందను పరామర్శిస్తున్నారు. అయితే గోవిందకు జరిగిన ప్రమాదం పై ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే గోవింద వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. కాల్పుల వెనుక అసలు విషయం ఏంటన్నది విచారణ పూర్తయిన తర్వాత తేలనుంది.
ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో గోవింద మాత్రమే ఉన్నారని.. అందువల్ల మరెవరిపై హత్యాయత్నం జరగలేదని పోలీసులు భావిస్తున్నారు. కానీ బుల్లెట్ దానంతట అదే పేలిందని గోవింద చెప్పినా పోలీసులు పూర్తిగా అంగీకరించలేదని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గోవింద పై జరిగింది కేవలం ప్రమాదమే అని.. ఇంకా దీనిపై కేసు నమోదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. ఇన్ స్పెక్టర్ దయానాయక్ నేతృత్వంలోని బృందం కేసు దర్యాప్తు చేస్తోంది. గోవింద్ చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆసుపత్రిని సందర్శించిన పోలీసులు నటుడిని కొన్ని ప్రశ్నలు అడిగారు. బుధవారం తెల్లవారుజామున కాల్పులు జరిగిన తీరును గోవింద వివరించారు. ఈ ఘటనకు సంబంధించి అతడిని మరోసారి విచారించే అవకాశం ఉంది.
గోవిందకు భద్రత కోసం రివాల్వర్ లైసెన్స్ ఉంది. అతని రివాల్వర్ చాలా పాతదని, సరిగ్గా తాళం వేయకపోవడంతో మిస్ ఫైర్ అయినట్లు సమాచారం. గోవింద కాలికి గాయం కావడంతో 8 నుంచి 10 కుట్లు పడ్డాయి. త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. గోవింద బంధువులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి వచ్చి ఆరోగ్యంపై ఆరా తీశారు.