Radhika SarathKumar: లోక్‌సభ ఎన్నికల్లో తన భార్య విజయాన్ని కాంక్షిస్తూ సీనియర్ నటుడు శరత్ కుమార్ పొర్లుదండాలు పెట్టారు. ఆ వీడియో వైరల్ అయ్యింది.
తన నటనతో దక్షిణాదిన సినీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన నటి రాధికా శరత్ కుమార్ (Radhika SarathKumar) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడులోని విరుదునగర్ (Virudhunagar) స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ఆమె విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని కాంక్షిస్తూ రాధిక భర్త, సీనియర్ నటుడు శరత్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు.
ఆదివారం రాత్రి విరుదునగర్‌లోని శ్రీ పరాశక్తి మారియమ్మన్ ఆలయాన్ని రాధిక దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత శరత్ కుమార్ (SarathKumar) ఆలయ ప్రాంగణంలో పొర్లు దండాలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు (Viral Video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. రాధిక తరఫున ఎన్నికల ప్రచారంలోనూ ఈ నటుడు చురుగ్గా పాల్గొన్నారు
2006లో రాధిక (Radhika SarathKumar) రాజకీయ ప్రస్థానం మొదలైంది. తన భర్త శరత్‌కుమార్‌తో కలిసి అన్నాడీఎంకేలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అదే ఏడాది అగ్ర నాయకత్వం వారిని తొలగించింది. 2007లో వారు ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి (AISMK) పార్టీని స్థాపించారు. దానికి ఉపాధ్యక్ష హోదాలో ఆమె సేవలు అందించారు. కొద్దిరోజుల క్రితం ఏఐఎస్‌ఎంకేను భాజపా (BJP)లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు కమలం పార్టీ టికెట్ దక్కింది.
ఇక విరుదునగర్ స్థానం నుంచి నటికి పోటీగా దివంగత నటుడు కెప్టెన్ విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకరన్ బరిలోకి దిగారు. అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా డీఎండీకే తరఫున ఆయనను నిలబెట్టారు. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మరోసారి పోటీ చేశారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. మరి ఈ ఆసక్తికర సమరంలో రాధికను గెలుపు వరిస్తుందో, లేదో తెలియాలంటే మంగళవారం వరకు ఆగాల్సిందే..!
Actor Sarathkumar visited the Sri Parasakthi Mariamman temple in Virudhunagar to pray for his wife and NDA candidate Radhika's success, as the counting of votes will be held on June 4.#actor #sarathkumar #visited #srioarasakthitemplE #wifesuccess @radhikasarath pic.twitter.com/eLJ5KbXEB8
— Pradeep (@PRADEEPDEE2) June 3, 2024