అధిక రక్తపోటు సమస్య నేటి కాలంలో చాలా సాధారణ సమస్యగా మారిపోయింది. ఈ సమస్య ఇప్పుడు వృద్ధులతో పాటు యువతలో కూడా బాగా పెరుగుతోంది. అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, తక్కువ శారీరక శ్రమ, ఊబకాయం ఇందుకు ప్రధాన కారకాలు.
అందుకే దీనిని జీవనశైలి వ్యాధిగా చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. కానీ జీవనశైలిని మెరుగుపరచుకోవడం ద్వారా దీన్ని చాలా వరకు నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే, ఇది గుండెపోటుకు దారి తీస్తుంది.
అధిక రక్తపోటును నియంత్రించడానికి, మీ జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా తగ్గించవచ్చు. అందులో ముఖ్యమైనది రోజులో మొదటి భోజనం అంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్. ఇది మీ రక్తపోటుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. బ్రేక్ ఫాస్ట్ రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. తాజా అధ్యయనం ప్రకారం, బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వ్యక్తులకు అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉందని తేలింది. కాబట్టి ఉదయం అల్పాహారం ఎప్పుడూ మిస్ చేయకూడదు.
బ్రేక్ ఫాస్ట్ ఎలా తీసుకోవాలి
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే, పోషకాలు అధికంగా ఉండే అల్పాహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం వల్ల మీ గుండె పని తీరు మరింత సమర్థవంతంగా చేయడానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇది మీ రక్తపోటును కూడా మెరుగుపరుస్తుంది. అందువల్ల, బ్రేక్ ఫాస్ట్ తీసుకున్నప్పుడల్లా, శరీరంలోని రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే పోషకాలు తప్పక తీసుకోవాలి.
బ్రేక్ ఫాస్ట్ ఏ సమయంలో తీసుకోవాలి
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆరోగ్యకరమైన రక్తపోటు కోసం నిద్రలేచిన ఒక గంటలోపు బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరం రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మీ గుండెపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. నిద్రలేచిన 30 నుండి 60 నిమిషాలలోపు తినడం వల్ల ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయి తగ్గుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఇది అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది.
బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల కలిగే నష్టాలు
అదే మీరు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. మీ శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఖాళీ కడుపుతో ఉండడం వల్ల యాసిడ్ ఏర్పడుతుంది. ఇది గ్యాస్ సమస్యకు దారితీస్తుంది. BP పెరగడం ప్రారంభమవుతుంది. గ్లూకోజ్ స్థాయి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా బ్రేక్ ఫాస్ట్ దాటవేయడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 21% పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌ని మిస్ చేసే అలవాటును మార్చుకుని ఖచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేయడం మంచిది. మీరు నిద్రలేచిన గంటలోపు బ్రేక్ ఫాస్ట్ చేయలేకపోయినా, వీలైనంత త్వరగా తినడానికి ప్రయత్నించాలి. అలాగే, హడావిడిగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడానికి బదులుగా, తినడానికి కొంత సమయం తీసుకోవాలి. ఎందుకంటే రక్తపోటు మీ ఆహారపు అలవాట్లకు సంబంధించినది. కాబట్టి నెమ్మదిగా తినడం మీ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.