సొoతిల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. దాన్ని సాకారం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హోమ్ లోన్లపై ఎక్కువగా ఆధారపడతారు. మీకు వచ్చే ఆదాయం ఆధారంగా వివిధ బ్యాంకులు మీకు రుణాలను మంజూరు చేస్తాయి.
వాటితో మీరు సొంతింటిని కోనుగోలు చేసుకోవచ్చు. ఆ రుణానికి కొంత వడ్డీ కలిపి ప్రతినెలా బ్యాంకు లేదా రుణం ఇచ్చిన సంస్థకు ఈఎమ్ఐలు చెల్లించాలి. ఇది దాదాపు 20 ఏళ్ల వరకూ మీ ఎంచుకున్న కాలాన్ని బట్టి ఉంటుంది. అంతకాలం పాటు ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొంత కాలం చెల్లించిన దానిని మధ్యలో భారాన్ని తగ్గించుకోవడానికి మరో హోమ్ లోన్ తీసుకుని ఇది క్లియర్ చేయొచ్చా? అంటే చేయచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలా అంటే ప్రస్తుతం ఉన్న బ్యాంకు అందిస్తున్న వడ్డీ కంటే తక్కువ వడ్డీకి ఏదైనా బ్యాంక్ రుణం ఇస్తుందేమో తెలుసుకొని దానికి మీ రుణమొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ఈ ఉదాహరణ చూడండి..
మీ వార్షిక ఆదాయం రూ.22 లక్షలు అనుకుందాం. మీరు 2021లో రూ. 70 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారు. దానికి 9 శాతం వడ్డీతో కలిసి నెలకు 55 వేలు ఈఎమ్ఐ కడుతున్నారు. మీ బాకీ తీరాలంటే దాదాపు 30 ఏళ్లు వాయిదాలు కట్టాలి. ఇక మీకు నెలకు రూ. 30 వేలు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోమ్ లోన్ వడ్డీరేటు, ఈఎమ్ఐ భారాన్ని తగ్గించుకోవడానికి, రుణదాతలను మార్చడానికి మీకు అవకాశం ఉంటుంది. అదెలా అంటే..
ముందుగా కొత్త రుణదాత వసూలు చేసే వడ్డీరేటు, మారడానికి విధించే అదనపు రుసుములు, మీ రుణం కాలవ్యవధి, మీ ఆర్థిక పరిస్థితి వంటి వాటిని పరిశీలించాలి.
పైనే తెలిపిన వివరాల ప్రకారం కొత్త రుణదాతకు మారడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. రూ. 70 లక్షల రుణం, 30 ఏళ్ల కాలపరిమితిని పరిగణనలోకి తీసుకుంటే వాయిదాల మొత్తం ఈ విధంగా ఉంటుంది.
మీ సిబిల్ 800 నుంచి 850 మధ్య ఉంటే మీకు 8.4 శాతం వడ్డీరేటు పడుతుంది. తద్వారా నెలవారీ ఈఎమ్ఐ రూ. 52,005గా ఉంటుంది. పాత ఈఎమ్ ఐతో పోల్చితే మీకు నెలకు రూ.2,995 ఆదా అవుతుంది.
మీ సిబిల్ స్కోర్ 740 నుంచి 799 మధ్య ఉంటే మీ తీసుకున్న రుణానికి 8.75 శాతం వడ్డీ రేటు విధిస్తారు. మీ ఈఎమ్ ఐ నెలకు 53,745 పడుతుంది. అంటే మీకు నెలకు రూ. 1,255 ఆదా అవుతుంది.
మీ వార్షిక ఆదాయం రూ. 22 లక్షలు, నెలవారీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి రూ. 30 వేలు కాబట్టి ఈఎమ్ఐ తక్కువగా ఉంటే మీ పొదుపు పెరుగుతుంది.
ముఖ్యంగా అదనపు ఖర్చులను పరిగణించాలి. ప్రస్తుత రుణదాతతో కూడా చర్చలు జరపాలి. రుణదాతను మార్చడం వల్ల కలిగే ప్రయోజనాన్ని కచ్చితంగా లెక్కవేయగలగాలి. దీర్ఘకాలిక ఉపయోగాలు, ఖర్చుల ఆధారంగా నిర్ణయం తీసుకోండి.