భోగి అనే పేరు ఎలా వచ్చింది?.. భోగి మంటల వెనుక ఉన్న అసలు కథ

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ముఖ్యమైనది. ముఖ్యంగా రైతులకు ఈ పండుగ అంటే ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. పంట చేతికి వచ్చిన ఆనందాన్ని, ప్రకృతికి కృతజ్ఞతను తెలియజేసే పండుగగా సంక్రాంతిని భావిస్తారు.


నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండుగల శ్రేణిలో మొదటి రోజు భోగి. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగిని ప్రజలు ఎంతో భక్తి, ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ ఏడాది జనవరి 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా తెల్లవారుజామునే ప్రజలు లేచి భోగి మంటలు వేస్తున్నారు.

భోగి పండుగలో ముఖ్యమైన ఆచారం భోగి మంటలు. పాత పనికిరాని వస్తువులను, చెక్కలు, పిడకలను కాల్చుతూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతారు. ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని పెద్దలు చెబుతారు. అలాగే చిన్నారులపై భోగి పళ్లు పోసి వారికి ఆరోగ్యం, ఆయుష్షు కలగాలని ఆశీర్వదిస్తారు.

భోగి అనే పదం ఎలా వచ్చింది అనే విషయంలో పురాణ కథలు ఉన్నాయి. సంస్కృతంలోని “భగ్” అనే పదం నుంచి భోగి అనే మాట పుట్టిందని చెబుతారు. భోగం అంటే శుభం, పవిత్రత, ఆనందం అని అర్థం. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిన రోజు ఇదేనని నమ్మకం. అలాగే వామనావతారంలో బలిచక్రవర్తి అహంకారాన్ని అణచిన సందర్భం కూడా ఈ రోజుతో ముడిపడి ఉందని చెబుతారు. మరోవైపు గోకులంలో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపాలకులను, గోవులను రక్షించిన సంఘటన కూడా భోగి పండుగకు సంకేతంగా భావిస్తారు.

జ్యోతిష్య పరంగా చూస్తే, ఈ సమయంలో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతాడు. గడిచిన దక్షిణాయనంలో ఎదురైన కష్టాలు, బాధలు భస్మమవ్వాలని కోరుకుంటూ ప్రజలు భోగి మంటలు వేస్తారని విశ్వాసం. పాతది వదిలి కొత్తదాన్ని ఆహ్వానించడమే భోగి యొక్క అసలు భావం.

శాస్త్రీయంగా కూడా భోగి మంటలకు ప్రాధాన్యత ఉంది. ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. భోగి మంటల వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. అంతేకాకుండా ధనుర్మాసంలో రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటంతో, పిడకలు కాల్చడం ద్వారా గాలిలోని సూక్ష్మజీవులు నశిస్తాయని చెబుతారు. దీంతో పరిసరాల గాలి శుద్ధి అవుతుంది. భోగి మంటల్లో రావి, మామిడి, మేడి వంటి ఔషధ గుణాలు ఉన్న చెట్ల బెరళ్లు, ఆవు నెయ్యిని వేస్తారు. వీటి నుంచి వెలువడే పొగను పీల్చడం వల్ల శరీరంలోని నాడులు ఉత్తేజితమై, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నమ్మకం ఉంది.

ఈ విధంగా భోగి పండుగ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఆధ్యాత్మికత, ఆరోగ్యం, ప్రకృతితో అనుబంధాన్ని చాటే గొప్ప పర్వదినంగా భావిస్తారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.