ఎదుటి వ్యక్తి మంచివాడా.. కాదా అని ఎలా తెలుసుకోవాలి? సైకాలజిస్టులు ఏం చెబుతున్నారు?

చర్మాన్ని బట్టి, ముఖాకృతులను బట్టి చూస్తే, మనలో చాలా మంది అందంగా, మంచివారిలా కనిపించొచ్చు. కానీ, పైపై మెరుగులు చూసి ఎవరినైనా అంచనా వేసేయొచ్చా?


వారు నిజంగా మంచివారా? కాదా.. అనే క్లారిటీ మనకెలా వస్తుందోనని ఎప్పుడైనా ఆలోచించారా? రండి, దీని గురించి సైకాలజిస్టులు ఒక థియరీ చెబుతున్నారు. దానిని బట్టి ఒక వ్యక్తి నిజంగా మంచివాడా కాదా అని ఇట్టే తెలుసుకోవచ్చట. అంతకంటే ముందు, అందరితో కలుపుగోలుగా ఉంటూ, నవ్వుతూ కనిపించే వ్యక్తి మంచివాడని వెంటనే నమ్మేసి మోసపోవద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే, మనముందు కనిపించినట్లుగా వారి వ్యక్తిత్వం ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుందని చెప్పలేం.

లక్షణాలను బట్టే వ్యక్తిత్వం:

ఒక వ్యక్తిని మంచివాడని కన్ఫమ్ చేయాలంటే, కొన్ని లక్షణాలను పరిశీలించాలట. అవేంటంటే, నిజాయితీ, కృతజ్ఞత, ధైర్యం, కష్టకాలంలోనూ చెక్కు చెదరని సంకల్పం బట్టి ఆ వ్యక్తిని మంచివాడని కన్ఫమ్ చేసుకోవచ్చట. నిపుణులు చెబుతున్న దానిని బట్టి అందమైన మనస్సు (బ్యూటిపుల్ సోల్) కలిగి ఉండే వారిలో ఇంకా ఏమేం లక్షణాలు ఉంటాయో చూసేద్దామా..?

ఎదుటి వ్యక్తుల్లో ఉన్న అందమైన మనస్సు లేదా ఆంతర్య అందం మీకు నచ్చుతుంది. అంటే, వారు కచ్చితంగా నిజాయితీతో వ్యవహరిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇంకా వారు ఇతరుల ముందు కనిపించే తీరు, మనసులో కలిగే భావాలు ఒకేలా ఉంటాయట. నిజాయితీతో వ్యవహరించే వారు మాత్రమే ఈ విధంగా ప్రవర్తించగలుగుతారట.

స్వభావాన్ని బయటపెట్టరు:

చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులు, చాలా సందర్భాల్లో, సంభాషణల్లో, చర్చల్లో తమలోని నిజ స్వభావం బయటపడుతుందని మౌనం వహిస్తుంటారు. మాట బయటపడకుండా జాగ్రత్తపడుతుంటారు. ఒకవేళ మాట్లాడినా కూడా పరిస్థితులకు తగ్గట్టుగా, అవసరానికో విధంగా వ్యవహరిస్తారు. వీలైనంత వరకూ ఏ పరిస్థితిలోనూ బాధ్యత తీసుకోకుండా ఉండేందుకే ప్రయత్నిస్తారు. ఎందుకంటే, ఆంతరంగికంగా వారిలో రాక్షస లక్షణాలు ఉంటాయి. కాబట్టే పరిస్థితిని దాటవేసే ప్రయత్నం చేస్తారు. కానీ, ఆంతరంగికంగా అందమైన మనసు ఉన్న వారు ఎటువంటి వారి ప్రశ్నలకైనా, ఎటువంటి సందర్భంలోనైనా తమ సమాధానాన్ని సూటిగా, స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారట. అవసరమైతే తమలోని లోపాలతో సహా బయటపెట్టి, తమ నిజమైన స్వభావాన్ని అందరికీ అర్థమయ్యేలా చేస్తారు.

పోల్చి చూడండి:

రిలేషన్లలో లేదా డేటింగ్ స్టార్టింగ్ టైంలో మీరు ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం తప్పనిసరి. ఈ సందర్భంలో మీకు అవతలి వ్యక్తిపై అంచనాలు ఉండటం సర్వసాధారణం. కానీ, అదే సమయంలో మంచి వ్యక్తుల లక్షణాలతో పోల్చి చూస్తూ వారి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు.

సమస్యల్లోనూ నిలబడ గలిగే గుణం:

అందమైన మనస్సు గలవారు పరిస్థితులను చూసే తీరులో ఎప్పుడూ ఒకే వైఖరి ప్రదర్శిస్తుంటారు. సుఖవంతమైన జీవితం గడుపుతున్నప్పుడైనా, సవాళ్లతో కూడిన కష్టకాలంలోనైనా వారి ఆలోచనలు స్థిరంగానే ఉంటాయి. వారు ఇబ్బందిగా అనిపించినప్పుడు పట్టుదల ప్రదర్శిస్తుంటారు. పరీక్షా కాలాన్ని తమకు మించినదిగా భావించకుండా ధ్యైర్యంగా ఎదుర్కుంటారు. నిజానికి అందమైన మనస్సు ఉన్న వాడు అంటే కేవలం ఆత్మవిశ్వాసంతో మాత్రమే ఉంటే సరిపోదు. జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు కూడా ధైర్యాన్ని ప్రదర్శిస్తూ, సున్నితంగా, ఆశతో సమాధానాలను వెదుకుతుంటారు.

ఏదైనా బంధం సుదీర్ఘ కాలం పాటు ఎటువంటి మనస్పర్దలు లేకుండా, తెగిపోకుండా కొనసాగుతుందంటే అక్కడ కచ్చితంగా మంచి మనస్సు గల వ్యక్తులు ఉన్నారని అర్థం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. మీ భాగస్వామితో వాదించడమనేది పోరాటం కాదు, అది అంగీకారాలను సాధించే ప్రయాణం, సవాళ్లను ఎదుర్కుంటున్నప్పుడు భాగస్వాముల మధ్య వాడీవేడిగా చర్చలు జరగడం మామూలే. ఈ సవాళ్లను సరైన ధైర్యంతో ఎదుర్కున్నప్పుడే మీ వ్యక్తిత్వం బయటపడుతుంది. వాదన సమయంలోనూ అందమైన మనస్సున్న వారు తమ తప్పు లేకున్నా క్షమాగుణంతో ఆ పరిస్థితి నుంచి తప్పుకుంటారు.