ఎన్ని రూపాయల స్టాంపుపై రాస్తే వీలునామా చెల్లుతుంది, రూల్స్ ఏం చెబుతున్నాయి

వీలునామా అంటే ఒక వ్యక్తి కోరిక మేరకు రాసే చట్టపరమైన పత్రం. దీని ద్వారా ఆ వ్యక్తి తన ఆస్తిని ఎలా, ఎవరికి పంచాలో నిర్ణయిస్తారు.


వీలునామాను చట్టబద్ధం చేయడానికి, దానిని ఒక నిర్దిష్ట స్టాంప్ పేపర్ మీద రాయాలని చాలా మందికి ఒక అపోహ ఉంది. కానీ వాస్తవానికి ఇది నిజం కాదు.

భారతదేశంలో వీలునామా ప్రాముఖ్యత దాని చట్టపరమైన విధానం, సాక్షులపై ఆధారపడి ఉంటుంది. స్టాంప్ విలువపై కాదు. అయినప్పటికీ, కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని పాటించాల్సిన అవసరం ఉంది. తద్వారా వీలునామా విషయంలో ఎటువంటి వివాదం ఉండదు. స్టాంప్ పేపర్ ధర, వీలునామాకు సంబంధించి మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

ఎన్ని రూపాయల స్టాంప్ పేపర్ మీద వీలునామా చెల్లుబాటు

భారత చట్టాల ప్రకారం వీలునామాను ఒక నిర్దిష్ట విలువ కలిగిన స్టాంప్ పేపర్ మీద రాయాల్సిన అవసరం లేదు. దీనిని సాధారణ తెల్ల కాగితంపై కూడా రాయవచ్చు. ఆ వీలునామా పూర్తిగా చెల్లుబాటు అవుతుంది. ఇది స్పష్టంగా, అర్థమయ్యేలా ఉంటే సరిపోతుంది. అయితే చాలా మంది దీనిని 50 రూపాయలు, రూ.100 స్టాంప్ పేపర్ మీద రాయాలని ఆసక్తి చూపుతారు.

వీలునామా పూర్తిగా ప్రామాణికంగా ఉండటానికి, ఆ పత్రం చట్టబద్ధం చేయడానికి ఇద్దరు సాక్షులు అవసరం. సంతకం చేసే సమయంలో ఆ సాక్షులు ఉండాలి. ఇది వీలునామా నిజమైనదని ప్రూవ్ చేస్తుంది. నోటరీ లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఆప్షన్ మాత్రమే, కానీ ఇది వీలునామా పత్రం చట్టపరమైన చెల్లుబాటును పెంచుతుంది.

వీలునామా రాసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

వీలునామా రాసేటప్పుడు ఆ పత్రంలో ఆస్తికి సంబంధించిన మొత్తం సమాచారం స్పష్టంగా, సరిగ్గా ఉండాలి. ఎవరికి ఎంత వాటా ఆస్తి ఇవ్వాలో, ఎందుకు ఇస్తున్నారో అందులో స్పష్టంగా పేర్కొనాలి. సంతకం చేసేటప్పుడు వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. తద్వారా తరువాత ఎటువంటి చట్టపరమైన సవాళ్లు ఉండవు. వీలునామాకు ఇద్దరు సాక్షులు అవసరం, అయితే వారు కుటుంబ సభ్యులు కాకపోతే మంచిది.

వీలునామాను నమోదు చేయడం తప్పనిసరి కాదు. కానీ రిజిస్ట్రేషన్ జరిగితే, భవిష్యత్తులో వివాదం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా మార్పులు చేస్తే, వాటిని కూడా లిఖితపూర్వకంగా పేర్కొనాలి. అన్ని నిబంధనలను పాటిస్తే సాధారణ కాగితంపై రాసిన వీలునామా సైతం పూర్తిగా చెల్లుబాటు అవుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.