Hyderabad vs Lucknow: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్‌.. రికార్డుల మీద రికార్డులు

www.mannamweb.com


సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్‌నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది.

తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని హైదరాబాద్‌ ఓపెనర్లిద్దరే 9.4 ఓవర్లలోనే ఉఫ్‌మని ఊదేశారు. ట్రావిస్ హెడ్ (89*; 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (75*; 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఊచకోతతో ఉప్పల్ స్టేడియం ఊర్రూతలూగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ పలు రికార్డులు నమోదు చేసింది.

వాటిపై ఓ లుక్కేద్దాం.

ఐపీఎల్ చరిత్రలో 160 కంటే పైచిలుకు స్కోరును అత్యంత వేగంగా ఛేదించిన తొలి జట్టుగా హైదరాబాద్‌ రికార్డు సృష్టించింది.
టోర్నీలో ఒక మ్యాచ్‌లో మొదటి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు (167) చేసిన జట్టుగానూ అవతరించింది. తర్వాత రెండు స్థానాల్లోనూ (దిల్లీపై 158/4), (ముంబయిపై 148/2) హైదరాబాదే ఉంది.

ఒక సీజన్‌లో పవర్ ప్లేలో రెండుసార్లు 100 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి జట్టుగా హైదరాబాద్ నిలిచింది.
ఒక ఐపీఎల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు (146 సిక్సర్లు.. 12 మ్యాచ్‌ల్లో) బాదిన జట్టుగా హైదరాబాద్‌ ఆరెంజ్ ఆర్మీ రికార్డును సొంతం చేసుకుంది. 2018లో చెన్నై 145 సిక్స్‌లు..

16 మ్యాచ్‌ల్లో పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్స్‌లు (35) బాదిన ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డు నెలకొల్పాడు. 195 బంతుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.
ఒక ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్‌ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడు కూడా అభిషేక్ శర్మనే.

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక బంతులు మిగిలుండగా (100 కంటే ఎక్కువ టార్గెట్ ఉన్న మ్యాచ్‌ల్లో) విజయం సాధించిన జట్టుగా హైదరాబాద్‌ రికార్డు సృష్టించింది.
ఐపీఎల్‌లో పవర్‌ ప్లేలో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ స్కోర్లు చేసిన రెండో ఆటగాడిగా ట్రావిస్ హెడ్(4) నిలిచాడు. ఇవన్నీ అతడు ఈ సీజన్‌లో చేసినవే. డేవిడ్ వార్నర్ (6) తొలి స్థానంలో ఉన్నాడు.