దేశంలో విమానాల రద్దు సంఘటనలు ప్రస్తుతం ఎక్కువయ్యాయి. ముఖ్యంగా దేశీయ సర్వీసుల్లో ఇవి ఎక్కువ ఉంటున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ పౌర విమానయాన సంస్థ ఇండిగో..
భారీగా విమానాల రద్దుతో వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో విమానాలు క్యాన్సిల్ అయినప్పుడు విమానయాన సంస్థల బాధ్యతలు ఏంటి.. డీజీసీఏ నిబంధనలు ఏం చెబుతున్నాయి.. ప్రయాణికులుగా మనకు ఎటువంటి హక్కులు ఉంటాయి.. ఈ కథనలో తెలుసుకుందాం..
భారతదేశంలో విమానాలు రద్దు అయినప్పుడు డీజీసీఏ (DGCA డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నిబంధనల ప్రకారం విమానయాన సంస్థలు ప్రయాణికులకు రిఫండ్, ప్రత్యామ్నాయ విమానం, భోజనం/హోటల్ సౌకర్యం వంటి బాధ్యతలు వహించాలి. అలాగే ప్రయాణికులకు పాసింజర్ ఛార్టర్ ఆఫ్ రైట్స్ ద్వారా కొన్ని స్పష్టమైన హక్కులు కల్పించారు.
విమానయాన సంస్థల బాధ్యతలు
- సమయానికి సమాచారం ఇవ్వాలి: విమానం క్యాన్సిల్ అయితే ఎస్‌ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా ముందుగానే తెలియజేయాలి.
- ప్రత్యామ్నాయ విమానం: అదే గమ్యస్థానానికి మరో విమానం ఉచితంగా ఏర్పాటు చేయాలి.
- రిఫండ్: ప్రయాణికుడు కోరుకుంటే పూర్తి టికెట్ ధర రిఫండ్ చేయాలి.
- భోజనం/హోటల్ సౌకర్యం: విమానం క్యాన్సిల్ లేదా 2 గంటలకంటే ఎక్కువ ఆలస్యం అయితే ప్రయాణికులకు భోజనం, రిఫ్రెష్‌మెంట్ వసతి కల్పించాలి. అదే 24 గంటలకంటే ఎక్కువ ఆలస్యం అయితే హోటల్ వసతితోపాటు ట్రాన్స్‌ఫర్(స్థానిక రవాణా) సౌకర్యం కల్పించాలి.
ప్రయాణికుల హక్కులు ఇవే..
- విమానం క్యాన్సిల్ అయితే ప్రయాణికులు ఛార్జీలు రిఫండ్ తీసుకోవచ్చు లేదా మరో విమానంలో ఉచితంగా ప్రయాణించవచ్చు.
- ఓవర్‌బుకింగ్ వల్ల ప్రయాణికుడికి సీటు దొరకకపోతే టికెట్ పూర్తి రిఫండ్‌తోపాటు పరిహారం పొందవచ్చు.
- లగేజీని విమానయాన సంస్థలు పోగొడితే నిబంధనల ప్రకారం ప్రయాణికులు పరిహారం పొందవచ్చు.
- విమానాల ఆలస్యం లేదా క్యాన్సిలేషన్‌పై స్పష్టమైన సమాచారం పొందే హక్కు ప్రయాణికులకు ఉంటుంది.
డీజీసీఏ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
- ప్రయాణికులు 7 రోజులు ముందే విమాన టికెట్ బుక్ చేసి, 24 గంటలలోపు రద్దు చేస్తే పూర్తి రిఫండ్ పొందవచ్చు.
- విమానాలు 2 గంటలకు మించి ఆలస్యమైతే ఉచితంగా భోజనం, రిఫ్రెష్‌మెంట్ సౌకర్యం కల్పించాల్సిందే.
- 24 గంటలకు మించి ఆలస్యమైతే ఉచితంగా హోటల్ వసతి, స్థానిక రవాణా ఏర్పాట్లు చేయాలి.
- విమానాల క్యాన్సిలేషన్ సందర్భంలో పూర్తి రిఫండ్ లేదా ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలి.
- అయితే సేఫ్టీ కారణాలు (వాతావరణం, టెక్నికల్ సమస్యలు) రీత్యా విమానాలు ఆలస్యం లేదా రద్దు అయితే రిఫండ్/రీబుకింగ్ తప్పనిసరి. కానీ అదనపు పరిహారం ఇవ్వకపోవచ్చు.




































