నిమిషం లేటయితే అరగంట జీతం కట్.. ఎక్కువ వర్క్ చేస్తే ఎక్కువ జీతం

జపాన్‌ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. అక్కడి వర్క్ కల్చర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుంది. తాజాగా జపాన్‌లో స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న ఒక భారత మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


ముఖ్యంగా జపాన్‌లో ‘ఓవర్ టైం’ పనిచేసే విషయంలో ఉండే రూల్స్, ఉద్యోగులకు ఇచ్చే గౌరవం చూసి ఇండియన్ ఇంటర్నెట్ యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ టీచర్ తన 7 నెలల అనుభవాన్ని వివరిస్తూ.. జపాన్ స్కూళ్లలో ప్రతి నిమిషం పనికి విలువ ఉంటుందని చెప్పారు.

జపాన్ వర్క్ కల్చర్ లో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. అక్కడ ఎక్స్‌ట్రా వర్క్ ఎవరూ బలవంతంగా రుద్దరు. ఒకవేళ టీచర్స్ తమ వర్క్ టైమింగ్స్ కంటే 30 నిమిషాలు అదనంగా పనిచేసినా.. దానికి కూడా ఓవర్ టైమ్ పేమెంట్ చట్టబద్ధంగా చెల్లిస్తారని టీచర్ చెప్పారు. రూల్స్ ఎంత కఠినంగా పాటిస్తారంటే.. అదనపు పనికి డబ్బులు ఇవ్వడమే కాదు, పనికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా సరే అర గంట జీతం కట్ చేస్తారంట. ఈ ట్రాన్స్రరెన్సీ వల్ల అటు యాజమాన్యానికి.. ఇటు ఉద్యోగికి సమయం పట్ల స్పష్టమైన అవగాహన ఉంటుంది. పని గంటల తర్వాత ల్యాప్‌టాప్ క్లోజ్ చేస్తే.. మళ్లీ ఆఫీస్ పనుల గురించి ఎవరూ ఒత్తిడి చేయరని స్కూల్ టీచర్ చెప్పారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎక్స్ ట్రా టైం పని చేసినప్పుడు అక్కడ లభించే గౌరవం. జీతం తీసుకుంటున్నప్పటికీ.. తోటి ఉద్యోగులు లేదా పై అధికారులు ఆ వ్యక్తి చేసిన అదనపు సాయానికి కృతజ్ఞతలు చెబుతారట. ఈ చిన్న అలవాటు వర్క్ చేస్తున్న ప్రదేశంలో సానుకూల వాతావరణాన్ని నింపుతుందని ఆ టీచర్ వివరించారు. అలాగే ఉపాధ్యాయులు వరుసగా 5 రోజులకు మించి పనిచేయకూడదనే కఠిన నిబంధన కూడా అక్కడ ఉంది. ఇది ఉద్యోగులు శారీరకంగా, మానసిక అలసటకు గురికాకుండా కాపాడుతుంది. ఇది వర్క్ లైఫ్ అలాగే పర్సనల్ లైఫ్ మధ్య సరైన సమతుల్యతను జపాన్ కల్పిస్తోంది.

భారతదేశంలో ఉపాధ్యాయులకు పని భారం ఎక్కువ, జీతం తక్కువ అని కొందరు అంటుంటే.. మాకు కేవలం బయోమెట్రిక్ మెషిన్ మాత్రమే థాంక్యూ చెబుతుందంటూ మరికొందరు వ్యంగ్యంగా స్పందించారు. ఇటీవల ఐఐటీ హైదరాబాద్ గ్రాడ్యుయేట్ కూడా జపాన్ వర్క్ కల్చర్ ని అభినందిస్తూ చేసిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో.. ఈ టీచర్ మాటలు మరోసారి చర్చకు దారితీశాయి. మొత్తం మీద కష్టానికి తగిన ప్రతిఫలం, పనిచేసే చోట ఇచ్చే గౌరవం అనేవి ఏ దేశానికైనా ఆదర్శవంతంగా ఉంటాయని.. ప్రజలను మోటివేట్ చేస్తాయని ఇది నిరూపిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.