ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల ఆదాయం.. బెస్ట్ స్కీమ్స్ ఇవే

www.mannamweb.com


సరిపడా డబ్బు చేతిలో ఉంటే ఏ చింతా లేకుండా జీవించొచ్చు. అందుకే సంపాదించిన సొమ్ము వృథా కాకుండా పొదుపు సూత్రం పాటిస్తున్నారు. పొదుపు చేసిన తర్వాతనే ఖర్చు పెట్టాలని ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. డబ్బు సంపాదించేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను వెతుకుతున్నారు. అదనపు ఆదాయం కోసం పార్ట్ టైమ్ జాబ్స్ కూడా చేస్తున్నారు. అయితే చేతిలో ఉన్న డబ్బును పెట్టుబడిగా పెట్టి మంచి రాబడిని అందుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వానికి చెందిన స్కీమ్స్ ఉన్నాయి. ఆ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే నెల నెలా ఆదాయం పొందొచ్చు. ప్రతి నెల ఆదాయం కావాలనుకునే వారికి బెస్ట్ స్కీమ్స్ ఇవే. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, అటల్ పెన్షన్ స్కీమ్, మంత్‌లీ ఇన్‌కం స్కీమ్ అధిక రాబడినిచ్చే పథకాలు. ఈ పథకాల్లో పెట్టుబడిపెడితే గ్యారంటీ రిటర్న్స్ తో పాటు, పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది.
మంత్‌లీ ఇన్‌కం స్కీమ్:

పోస్టాఫీస్ అందించే పథకాల్లో మంత్‌లీ ఇన్‌కం స్కీం ఒకటి. ఇందులో ఒకేసారి పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఈ పథకం కాల వ్యవధి ఐదు సంవత్సరాలు. ఐదేళ్ల పాటు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. ఐదేళ్ల మెచ్యూరిటీ తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం వస్తుంది. దీంట్లో వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. సింగిల్ అకౌంట్ కింద గరిష్టంగా రూ. 9 లక్షలు, జాయింట్ అకౌంట్లో అయితే రూ .15 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పెట్టుబడి అయిన రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తే గరిష్టంగా ప్రతి నెలా రూ. 9,250 చొప్పున పెన్షన్ పొందొచ్చు.
సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్:

ఈ పథకంలో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వ్యక్తి లేదంటే జీవిత భాగస్వా మితో ఉమ్మడి ఖాతాను ప్రారంభించొచ్చు. ఈ పథకంలో జనవరి 1, 2024 నుంచి ప్రతి నెలా రూ.20 వేలు పెట్టుబడి పెట్టే వారికి ఏడాదికి 8.2 శాతం వడ్డీ అందిస్తుంది. కేవలం 1000 రూపాయలతో ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ స్కీమ్‌లో 5 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందులో గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 30 లక్షల వరకు ఉంటుంది. రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 2,46,000 వడ్డీ వస్తుంది. అంటే మీకు నెలకు రూ. 20,500 ఆదాయం వస్తుంది.

అటల్ పెన్షన్ స్కీమ్:

ఈ పథకంలో 18 నుంచి 40 ఏళ్లలోపు వారు చేరొచ్చు. 60ఏళ్ల తర్వాత పెట్టిన పెట్టుబడిపై ఆదారపడి ప్రతి నెల పెన్షన్ రూపంలో ఆదాయం సమకూరుతుంది. పెట్టిన పెట్టుబడిపై 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 1000, రూ. 2000, రూ. 3 వేలు, 4 వేలు, గరిష్టంగా రూ. 5 వేల వరకు పెన్షన్ పొందొచ్చు. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి ఈ స్కీమ్ లో చేరితే నెలకు రూ. 42 నుంచి గరిష్టంగా రూ. 210 వరకు చెల్లించాలి. ఒక వేళ నెలకు రూ. 210 చెల్లించాలనుకుంటే.. రోజుకు రూ. 7 ఆదా చేస్తే చాలు. 60ఏళ్లు నిండిన తర్వాత రూ. 5 వేల పెన్షన్ అందుకోవచ్చు.