చికెన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మాంసాహార పదార్థాలలో ఒకటి. దాదాపు ప్రతి దేశంలోనూ వందల రకాలుగా చికెన్ తయారు చేసి ఆరగించేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా చికెన్ అంటే చాలా మందికి ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. సాధారణ రోజుల్లో కూరగానీ, బిర్యానీగానీ చేసుకుంటూ ఉంటాం. కానీ అదే చికెన్‌ను కొంచెం కొత్త రుచితో, కొత్త స్టైల్లో చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అలాంటి ప్రత్యేకమైన వంటకమే “వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై”.
వెల్లుల్లి కారం సువాసన, మసాలాల రుచి, చికెన్ జ్యూసీనెస్.. ఇలా అన్ని కలిపి ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తినేస్తారు. ఈ వంటకం ఇంట్లో తయారు చేయడానికి సులభమే కాకుండా.. ఎక్కువ ఖర్చు కూడా ఉండదు. ముఖ్యంగా కుటుంబం మొత్తానికి కూడా నచ్చే రుచిని ఇస్తుంది. కాగా వెల్లుల్లి కారం అంటే సాధారణంగా చాలా ఇళ్లలో చపాతీ, అన్నం లేదా రొట్టెలతో తినే ఒక రుచికరమైన పొడి. ఇందులో మసాలాలు సరిగ్గా వేయించడంతో వచ్చే సువాసన, వెల్లుల్లి తీపి-పులుపు-కారం కలయిక చికెన్‌లో కలిస్తే రుచి మళ్లీ మూడు రెట్లు పెరుగుతుంది. ఇది సాధారణ చికెన్ ఫ్రైకి కొత్త రుచి అందిస్తుందని అంటున్నారు. ఇది ఎలా చేయాలో మీకోసం ప్రత్యేకంగా..
వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై కోసం కావాల్సిన పదార్థాలు..
చికెన్ ఫ్రై కోసం కావాల్సినవి..
- చికెన్ (1/2 కిలో లేదా మీ అవసరం మేరకు)
- ఉల్లిపాయ
- టమాటా
- అల్లం-వెల్లుల్లి పేస్ట్
- కారం
- పసుపు
- ఉప్పు
- కరివేపాకు
- కొత్తిమీర
- నిమ్మరసం
- ఆయిల్
వెల్లుల్లి కారం కోసం కావాల్సినవి..
- దాల్చిన చెక్క
- జీలకర్ర
- మిరియాలు
- లవంగాలు
- ధనియాలు
- యాలకులు
- ఎండు మిరపకాయలు లేదా కారం
- వెల్లుల్లి రెబ్బలు
- కొద్దిగా ఉప్పు
వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలి?
ముందుగా మసాలా సిద్ధం చేసుకోవడం :
- మొదటిగా ఒక చిన్న పాన్ తీసుకొని వేడి చేసి.. దాల్చిన చెక్క, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకుల్ని స్వల్పంగా వేయించాలి. వేయించిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి.
- తర్వాత వీటిని మిక్సీ జార్‌లో వేసి వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు (లేకుంటే కారం), ఉప్పు వేసి మెల్లగా పేస్టులా కాకుండా మధ్యస్థమైన పొడిలా చేసుకోవాలి.
ఇప్పుడు మనకి వెల్లుల్లి కారం మసాలా సిద్ధంగా ఉంటుంది.
చికెన్ ఫ్రై తయారీ విధానం..
- కడాయిలో ఆయిల్ వేసి వేడి చేయాలి. అందులో చికెన్ వేసి మూత పెట్టి మధ్య మంట మీద ఉంచాలి.
- అప్పుడు చికెన్‌లోని నీరు బయటకు వస్తుంది. ఆ నీరు పూర్తిగా ఇంకే వరకు వేయించాలి (ఇది చికెన్ జ్యూసీగా, టెండర్‌గా అయ్యేలా చేస్తుంది )
- ఇప్పుడు ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
- అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి.
- తర్వాత టమాటాలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
- ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, కరివేపాకు వేసి బాగా కలపాలి.
- మసాలాలు చికెన్‌పై బాగా పట్టేలా కలుపుతూ 5-10 నిమిషాలు చిన్న మంట మీద ఫ్రై చేయాలి.
- ఇప్పుడు ముందుగా చేసుకున్న వెల్లుల్లి కారం పొడి వేసి చికెన్‌కి బాగా అంటుకునేలా కలపాలి.
- చిన్న మంటలో 5 నిమిషాలు ఫ్రై చేస్తే సువాసన మొత్తం వంటగది నిండిపోతుంది.
- చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసి గ్యాస్ ఆఫ్ చేయాలి.
వేడి వేడి అన్నంతో, జొన్న రొట్టె / రాగి సంగటి, చపాతీ లేదా పరోటాతో లేదా స్టార్టర్‌గా పార్టీ ప్లేటర్‌లో ఈ వంటకం ఏ సందర్భానికైనా బాగా సూట్ అవుతుంది.
అదనపు టిప్స్..
- చికెన్‌ను ముందుగా కొంచెం నిమ్మరసం + ఉప్పు + మిరియాల పొడితో 20 నిమిషాలు మెరినేట్ చేస్తే రుచి రెట్టింపు అవుతుంది.
- ఆయిల్‌లో కొద్దిగా నెయ్యి వేసుకుంటే సువాసన మరింత పెరుగుతుంది.
- చికెన్ బ్రెస్ట్ కంటే చికెన్ తై పీసులు వాడితే జ్యూసీగా ఉంటుంది.
- స్పైసీగానో, తక్కువ కారంగా కావాలనుకుంటే కారం పరిమాణం మార్చుకోవచ్చు.
- వెల్లుల్లి కారానికి కొద్దిగా ఎండు కొబ్బరి వేసినా రుచి మరింత బాగుంటుంది.



































