మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో అధిక రాబడిని అందజేస్తాయి. వాటిలో సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) అనేది సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చాలా వీలుగా ఉంటుంది.
దీనిలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి, కాలక్రమేణా మూలధనం పెంచుకోవడానికి సిప్ ప్రధాన ఎంపికగా మారింది. అయితే మార్కెట్ లో ఒడిదొడుకుల సమయంలో పెట్టుబడిదారులు తమ సిప్ లను నిలిపివేయవచ్చు. అనుకూలమైన వాతావరణం నెలకొనే వరకూ, మార్కెట్ లో స్పష్టత వచ్చే వరకూ ఆపివేసి, ఆ తర్వాత కొనసాగించవచ్చు. ఈ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని అంశాలను బాగా గమనించాలి.
సిప్‌ను ఆపాలా? వద్దా..?
మార్కెట్ ఒడిదుడుకుల సమయంలో మీ సిప్ ను ఆపివేయాలా, వద్దా అనే నిర్ణయం తీసుకోవడంలో మీ పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్, మార్కెట్ పరిస్థితులను బాగా గమనించాలి. మీ ఆర్థిక పరిస్థితులు, లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. దీర్ఘకాలంలో రాబడి సాధించడం మీ లక్ష్యమైతే సిప్‌లను ఆపకూడదని నిపుణులు చెబుతున్నారు.
సిప్ ను కొనసాగించడమే మంచిది
ఆర్థిక నిపుణుల సూచనల ప్రకారం సిప్ ను పాజ్ చేయకపోవడమే మంచిది. మీ ఖాతాలో డబ్బులు లేకపోయి, వాటిని అడ్జెస్ట్ చేయడానికి వీలు లేనప్పుడు మాత్రమే పాజ్ ఆలోచన చేయాలి. అంతవరకూ ఆపకపోవడం ఉత్తమం. మీరు ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి కొంత కాలం పాటు పాజ్ చేసినా, దానిని అలాగే కంటిన్యూ చేయడం మంచిది కాదు. ఎందుకుంటే సిప్ ను పాజ్ చేయడం వల్ల మీ పెట్టుబడులపై దీర్ఘకాలిక ప్రభావం పడుతుంది. దాని వల్ల మీ రాబడికి నష్టం కలుగుతుంది.
కొన్ని మార్పులు అవసరం
మార్కెట్ లో ఒడిదొడుకులు ఉన్నప్పుడు మాత్రం కొన్ని చర్యలు తీసుకోవచ్చు. మార్కెట్ లలో రిటర్న్ లను ఆప్టిమైజ్ చేయడానికి సిప్ లను మార్చడం లేదా రీషప్ చేసుకోవచ్చు. మీ మ్యూచువల్ ఫండ్స్‌లో దాదాపు 60 శాతం ఈక్విటీ ఫండ్లుగా ఉంటాయి మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా వాల్యుయేషన్ తగ్గినప్పుడు మీరు డెట్ ఫండ్స్,హైబ్రిడ్ ఫండ్స్ వంటి మరింత స్థిరంగా ఉండే ఫండ్లకు మారడం మంది. మార్కెట్ లో స్థిరత్వం ఏర్పడిన తర్వాత మీ ప్లాన్ లకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేయడానికి మళ్లీ మీ మునుపటి ఫండ్‌కి మారవచ్చు.
అంచనా ముఖ్యం
సిప్ పాజ్ నిర్ణయం తీసుకునే ముందు రిస్క్, రిటర్న్ తదితర వాటిని అంచనా వేయాలి. మీకు వచ్చే రాబడి మార్కెట్ ప్రతికూల ప్రభావాలను అధిగమించగలదా, వివిధ ఫండ్లకు మారడం ద్వారా మీరు నష్టాలను తగ్గించుకోగలరా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలి. అలాగే మార్కెట్ దిద్దుబాట్ల సమయంలో ధరలు తగ్గినప్పుడు మీ పోర్ట్‌ఫోలియోకు అనుకూలమైన యూనిట్ల సిప్ లను కొనుగోలు చేసుకోవచ్చు. మీ సిప్ లను పాజ్ చేయకుండా కొనసాగించడానికి, లేదా మారడానికి నిర్ణయించుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఏది ఏమైనా మార్కెట్ ఒడిదొడుకుల సమయంలో సిప్‌ను పాజ్ చేయడం వల్ల కొన్ని నష్టాలను తగ్గించుకోవచ్చు. కానీ ఆ నిర్ణయం దీర్ఘకాలంలో, రాబడిని కోల్పోయేలా చేస్తుంది.