టెన్నిస్‌లో భారత్ ఘనకీర్తి.. 14 ఏళ్లకే ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్! ఎవరీ జెన్సీ కానాబార్?

 టెన్నిస్ ప్రపంచంలో భారత కీర్తి పతాకాన్ని ఓ చిన్నారి రెపరెపలాడించింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత యువ టెన్నిస్ సంచలనం జెన్సీ కానాబార్ సరికొత్త చరిత్ర సృష్టించింది.


14 ఏళ్ల ప్రాయంలోనే ఆస్ట్రేలియన్ ఓపెన్ అండర్-14 టైటిల్‌ను కైవసం చేసుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా నిలిచింది.

ఓటమి అంచు నుంచి అద్భుత విజయం

మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జెన్సీ కానాబార్, ఆస్ట్రేలియాకు చెందిన ముసెమ్మా కిలెక్‌తో తలపడింది. ఒకానొక దశలో జెన్సీ 3-6, 0-2తో వెనుకబడి ఓటమి అంచున నిలిచింది. అయితే అసాధారణ పోరాట పటిమను కనబరిచిన ఆమె.. తర్వాతి రెండు రౌండ్లలో 6-4, 6-1 స్కోరుతో ప్రత్యర్థిని చిత్తు చేసి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. గతేడాది బాలుర విభాగంలో అర్ణవ్ పాపర్కర్ ఈ టైటిల్ గెలవగా.. ఇప్పుడు బాలికల విభాగంలో జెన్సీ ఆ రికార్డును సమం చేసింది.

ఎవరీ జెన్సీ కానాబార్?

గుజరాత్‌లోని జునాగఢ్‌కు చెందిన జెన్సీ కానాబార్ భారత టెన్నిస్ రంగంలో అత్యంత ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి. ఆమె ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (AITA) అండర్-14, అండర్-16 విభాగాల్లో నెంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 2025లో ఏషియన్ అండర్-14 ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న జెన్సీ.. తన అరంగేట్రంలోనే ఐటీఎఫ్ (ITF J30) అహ్మదాబాద్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది.2026 ప్రారంభంలోనే ఆమె AITA ఉమెన్స్ సింగిల్స్ ర్యాంకింగ్‌లో కూడా నెంబర్ 1 స్థానానికి చేరుకోవడం విశేషం.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.