రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ పవర్ ట్రైన్ వచ్చేస్తోంది. భారత రైల్వే హైడ్రోజన్-శక్తితో నడిచే రైలును ఆవిష్కరించింది.
ఈ హైడ్రోజన్ రైలు అత్యంత పొడవైనది. అలాగే అత్యంత శక్తివంతమైనది కూడా. పర్యావరణహిత రవాణా దిశగా అడుగులో భాగంగా పరిశోధన, రూపకల్పన, ప్రమాణాల సంస్థ (RDSO) నిర్దేశించిన స్పెసిఫికేషన్లతో హైడ్రోజన్ పవర్ ట్రైన్ రూపొందించారు. భారత రైల్వేలు పైలట్ ప్రాతిపదికన హైడ్రోజన్ రైలు తయారీని పూర్తి చేశాయి.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత పొడవైన ఈ ‘మేడ్ ఇన్ ఇండియా’ హైడ్రోజన్ ట్రైన్ ఏకంగా 2,400kW శక్తివంతమైన ఉత్పత్తితో 10-కోచ్ డిజైన్‌ను కలిగి ఉంది. జీరో ఉద్గారాలతో పూర్తిగా పర్యావరణహితంగా ఉంటుంది. ఈ
ఆవిష్కరణతో పర్యావరణ అనుకూల ప్రయాణానికి గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు.
దేశంలో హైడ్రోజన్ రైలు సెట్ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వని వైష్టవ్ పేర్కొన్నారు. ఈ హైడ్రోజన్ రైలు నిర్మాణాన్ని పూర్తిగా దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేశామని రైల్వే మంత్రి
పేర్కొన్నారు. రైలు నిర్వహణకు అవసరమైన హైడ్రోజన్‌ను సరఫరా చేసేందుకు హర్యానాలోని జింద్‌లో విద్యుద్విశ్లేషణ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ రైలులో హైడ్రోజన్ ఇంధన కణాలు ఆక్సిజన్ తో రసాయన చర్య ద్వారా హైడ్రోజన్ వాయువును విద్యుత్తుగా మారుస్తాయి. ఈ విద్యుత్తుతో రైలు నడుస్తుంది. ఇందులో ఉప ఉత్పత్తులుగా వెలువడేవి నీరు, ఆవిరి మాత్రమే. అవసరమైన రసాయన ప్రక్రియల కోసం రైలుకు గంటకు సుమారు 40వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఈ రైలు నుంచి పర్యావరణానికి హానికరమైన ఎటువంటి ఉద్గారాలు వెలువడవు.
ప్రత్యేకతలివే :
రైల్వే మంత్రి ప్రకారం.. దేశంలోని ఫస్ట్ హైడ్రోజన్ రైలు సెట్ ప్రపంచంలోనే అతి పొడవైన (10 కోచ్‌లు), అత్యంత పవర్‌ఫుల్ (2400 kW) బ్రాడ్ గేజ్ హైడ్రోజన్ రైలు సెట్. ఈ రైలు సెట్‌లో 2 డ్రైవింగ్ పవర్ కార్లు (DPCs)
ఉంటాయి. ఒక్కో పవర్ కార్‌కు 1200kW సామర్థ్యం కలిగి ఉంటాయి. మొత్తంగా 2400 kW పవర్ జనరేట్ చేస్తుంది.
10 ప్యాసింజర్ కోచ్‌లు :
ఈ హైడ్రోజన్ రైలు సెట్‌లో మొత్తం 10 ప్యాసింజర్ కోచ్‌లు ఉన్నాయి. పూర్తిగా పర్యావరణ అనుకూల టెక్నాలజీని ఉపయోగించారు. ఈ హైడ్రోజన్ పవర్‌తో నడిచే రైలు సెట్ పూర్తిగా జీరో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను
ఉత్పత్తి చేస్తుంది. అంటే.. ఏకైక ఉద్గారం నీటి ఆవిరితోనే నడుస్తుంది అనమాట. రాబోయే జనరేషన్ రైల్వే ఫ్యూయిల్ టెక్నాలజీ, క్లీన్, గ్రీన్ అంతా ఉద్గారరహితంగా ఉంటుంది. ఇంధన ఆధారిత టెక్నాలజీ అభివృద్ధికి
ప్రత్యామ్నాయంగా భారతీయ రైల్వేలకు ఈ హైడ్రోజన్ పవర్‌తో నడిచే రైళ్లను తీసుకురావాలని భావిస్తున్నాయి.
ప్రాజెక్టు మొదటి దశ నుంచి హైడ్రోజన్ ట్రాక్షన్ టెక్నాలజీ, మోడల్ తయారీ అభివృద్ధి వరకు భారతీయ రైల్వేల మొదటి ప్రయత్నమని రైల్వే మంత్రి పేర్కొన్నారు. ఎందుకంటే.. ఇప్పటికీ పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి ఖర్చును
ఇప్పటికే ఉన్న సాంప్రదాయ ట్రాక్షన్ వ్యవస్థలతో పోల్చడం సరైనది కాదన్నారు.


































