SRH vs RR, IPL 2024: క్వాలిఫయర్-2కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఆ జట్టే ఫైనల్‌కు
ఐపీఎల్ 2024లో మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు కూడా వర్షం అంతరాయం కలిగింది. కానీ మ్యాచ్ రద్దు కాలేదు. పూర్తి 20 ఓవర్ల ఆట జరిగింది. ఇప్పుడు క్వాలిఫయర్ 2 రౌండ్ మ్యాచ్ కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ మైదానంలో జరగనుంది. మరోవైపు దక్షిణ భారతదేశంలో రుతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. అందుకే ఈ మ్యాచ్‌లో కూడా వర్షం కురిసే అవకాశముంది. క్వాలిఫయర్ 2 వర్షం కురిపిస్తే ఫైనల్‌కు ఎవరికి టిక్కెట్టు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండో క్వాలిఫయర్ మ్యాచ్ శుక్రవారం, మే 24న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్లో కోల్‌కతా నైట్ రైజర్స్‌తో తలపడనుంది. అయితే వర్షం కురిసి మ్యాచ్ రద్దు చేస్తే ఫైనల్ బెర్తు ఎవరిదన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో ఉంది.
లీగ్ రౌండ్‌లో వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ రద్దు చేసినప్పుడు, రెండు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. కానీ క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 రౌండ్ మ్యాచ్ ల విషయంలో అలా కాదు. ఈ మ్యాచ్‌లో వర్షం కురిస్తే అదనంగా మరో రెండు గంటల సమయం, అలాగే ఒక రోజు రిజర్వ్ డే కేటాయించారు. రిజర్వ్ రోజు కూడా వర్షం కురిస్తే సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలనుంది. ఇంత చేసిన మ్యాచ్ జరగకపోతే మాత్రం రౌండ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జట్టు ఫైనల్ రౌండ్‌కు చేరుకుంటుంది.
హైదరాబాద్ కే లాభం..
లీగ్ రౌండ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు కు సేమ్ పాయింట్లు ఉన్నాయి. కానీ నెట్ రన్ రేట్ పరంగా హైదరాబాద్ దే ఆధిపత్యం. తద్వారా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. దీంతో క్వాలిఫైయర్ మ్యాచ్ రద్దయితే మాత్రం హైదరాబాద్‌కు ఫైనల్ అవకాశం దక్కనుంది. లీగ్ దశలో హైదరాబాద్ ఆడిన 14 మ్యాచ్‌లలో 8 మ్యాచ్‌లు గెలిచింది, 5 మ్యాచ్‌లు ఓడిపోగా, 1 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. హైదరాబాద్‌కు ఖాతలో 17 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ +0.414.