Israel Army Attack : వెస్ట్ బ్యాంక్ గాజాలో ఇజ్రాయెల్ దాడి.. 14 మంది మృతి

www.mannamweb.com


Israel Army Attack on Westbank Refugee Camp : పాలస్తీనా లక్ష్యంగా.. వెస్ట్ బ్యాంక్ గాజాలో ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో 14 మంది మరణించారు. వెస్ట్ బ్యాంక్ లోని శరణార్థి శిబిరంపై జరిగిన ఆపరేషన్ లో 14 మంది మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. పాలస్తీనా నగరమైన తుల్కర్మ్ కు సమీపంలో ఉన్న నూర్ షామ్స్ ప్రాంతంలో ఇజ్రాయెల్ దళాలు శుక్రవారం (ఏప్రిల్ 20) తెల్లవారుజామున దాడిని ప్రారంభించాయి. శనివారం వరకూ కొనసాగిన ఈ దాడుల్లో.. సైనిక వాహనాలు పేలిన శబ్దాలు వినిపించాయి.

మరోవైపు.. సౌత్ గాజాలో ఒక ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దళం చేసిన దాడిలో ఆరుగురు చిన్నారులు సహా తొమ్మిది మంది మరణించారు. మృతులలో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఉన్నారు. వీరి మృతదేహాలను రఫా అబూ యూసఫ్ అల్ నజ్జర్ ఆస్పత్రికి తరలించారు. గతేడాది అక్టోబర్ 7న మొదలైన ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ దాడుల్లో వేలాది మంది మరణించారు.

ఇటీవలే ఇజ్రాయెల్ పై ఇరాన్ మిస్సైళ్లతో ప్రతీకార దాడికి విరుచుకుపడిన విషయం తెలిసిందే. అందుకు ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడి చేసింది. అయితే.. ఇజ్రాయెల్ తమపై ప్రయోగించినవి అసలు డ్రోన్లే కాదని ఆ దేశ విదేశాంగమంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్ కొట్టిపారేశారు. అవి తమ పిల్లలు ఆడుకునే ఆటబొమ్మల్లా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ ప్రతిదాడి కావాల్సిందేనని ఉంటే మాత్రం.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.