ఐటిఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు… కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదే.

కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITRలు) ఫైల్ చేయడానికి గడువును ఒక రోజు పొడిగించి సెప్టెంబర్ 16 చివరి తేదీగా నిర్ణయిస్తున్నట్లు అధికారికంగా తెలిపింది.


కాగా సెప్టెంబర్ 15 తో ఐటిఆర్ ఫైలింగ్ చివరి తేదీ ముగిసినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల గడువు తేదీని పొడిగించింది. నిజానికి గడచిన రెండు రోజులుగా ఐటిఆర్ ఫైలింగ్ సమయంలో వెబ్ సైట్ కు సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కారణంగానే నిర్ణయం తీసుకున్నట్లు సీబిడిటి అధికారులు ఒక నోట్ రూపంలో తెలిపారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) తెలిపిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 15 వరకు 7.3 కోట్ల ITRలు దాఖలయ్యాయి. ఇది గత ఏడాది దాఖలైన 7.28 కోట్ల ITRల కంటే ఎక్కువ అని తేలింది.

ఇదిలా ఉంటే చివరి రోజు పెద్ద ఎత్తున యూజర్లు తమ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆసక్తి చూపించారు. దీంతో సర్వర్లలో లోపాలు తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. గడచిన 48 గంటలుగా పలు మార్లు ఫైలింగ్ ప్రక్రియలో యూజర్లకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ కారణంగా టాక్స్ ఫైలింగ్‌లు నిలిచిపోయాయి. దీనిపై స్పందించిన ఐటీ విభాగం బ్రౌజర్ సమస్యలను పరిష్కరించేందుకు యూజర్లకు కొన్ని సూచనలు ఇచ్చింది. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. అలాగే ఫిర్యాదులు తగ్గలేదు. చివరికి, గడువు తేదీని మరో రోజు పొడిగిస్తూ CBDT తాజా ప్రకటన జారీ చేసింది. అంతకుముందు, ఏప్రిల్, మే నెలల్లో ITR ఫాంలలో చేసిన మార్పుల కారణంగా గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15కి పొడిగిస్తూ నిర్ణయంం తీసుకున్నారు. ఇప్పుడు ఈ గడువును మరోసారి సెప్టెంబర్ 16 వరకు పొడిగించారు. పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.