వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. బాపట్ల జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని మేదరమెట్లలో పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తల్లి భౌతికకాయానికి నివాళి అర్పించారు. తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి ఆయన రావడం ఇక్కడికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రంరెడ్డి పిచ్చమ్మ సోమవారం ఒంగోలులో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె వయస్సు 85 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడ్డారు. ఒంగోలు నివాసంలో తుదిశ్వాస విడిచారు. నేడు స్వస్థలం మేదరమెట్లలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పిచ్చమ్మ కుటుంబంతో వైఎస్ జగన్‌కు బంధుత్వం ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు స్వయానా బాబాయ్ అవుతారు వైవీ సుబ్బారెడ్డి. ఈ నేపథ్యంలో పిచ్చమ్మ అంత్యక్రియలకు జగన్.. తన తల్లి విజయమ్మతో కలిసి హాజరయ్యారు. ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తల్లిని కోల్పోయిన దుఖంలో ఉన్న వైవీ సుబ్బారెడ్డిని పలకరించారు. ఓదార్చారు. విజయమ్మతో కలిసి మేదరమెట్లకు రావడం, పిచ్చమ్మకు నివాళి అర్పించడం చర్చనీయాంశమైంది. సరస్వతి పవర్ షేర్ల వ్యవహారంలో జగన్ కుటుంబంలో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. కేసుల వరకూ వెళ్లిందీ వ్యవహారం. తన చెల్లెలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిలపై ఫిర్యాదు సైతం చేశారు జగన్.
ఈ విషయంలో కూతురి వైపే నిలిచారు విజయమ్మ. సరస్వతీ పవర్ సంస్థలో మెజారిటీ వాటాలు అంటే 99 శాతం షేర్లు తన పేరు మీదే ఉన్నాయంటూ గతంలో వెల్లడించారు. వైఎస్ జగన్‌కు గానీ, కోడలు భారతికి గానీ వాటాలు లేవంటూ విజయమ్మ అప్పట్లో తేల్చి చెప్పారు. దీనితో ఈ వాటాల వివాదం మరింత తీవ్రతరమైందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఇప్పుడు తాజాగా తల్లితో కలిసి జగన్.. మేదరమెట్లకు రావడం అందర దృష్టినీ ఆకర్షించింది. అక్కడ ఉన్నంత సేపూ విజయమ్మ వెంటే కనిపించారాయన. తల్లితో కలిసి పిచ్చమ్మ భౌతికకాయానికి నివాళి అర్పించారు. వైవీ సుబ్బారెడ్డిని ఓదార్చే సమయంలోనూ విజయమ్మ ఆయన వెంటే ఉన్నారు.