తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం అనుపల్లిలో కాసేపట్లో జల్లికట్టు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు తమిళనాడు నుంచి కూడా వందలాది కోడె గిత్తలు తరలి వచ్చాయి.
పశువుల మెడపై కట్టిన బహుమతులను సొంతం చేసుకునేందుకు యువకులు భారీ సంఖ్యలో పోటీ పడుతున్నారు. పండుగను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు యజమానులు ఎద్దులను రంగురంగుల పూలతో, ప్రత్యేక ఆభరణాలతో అందంగా అలంకరించారు.
ఇక, ఈ జల్లికట్టును వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు అనుపల్లికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో భారీగా మోహరించి, భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గ్రామస్తులు ప్రత్యేకంగా ఇనుప గ్రిల్స్, తాత్కాలిక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. అనుపల్లి వైపు వచ్చే వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రధాన రహదారుల్లో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. జల్లికట్టుతో పాటు గ్రామంలోని పురాతన సంప్రదాయాలను పాటిస్తూ నిర్వహించే ఈ వేడుకతో స్థానికంగా పండుగ వాతావరణం నెలకొంది.

































